YS Jagan Offer To Rayalaseema Farmersఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో నడిపిస్తున్నానని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేసి మరింత సమర్ధంగా తీర్చిదిద్దుతున్నానని చెప్పుకొంటారు. ఆయనకి మంత్రులు, ఎమ్మెల్యే తాళం వేస్తుంటారు అది సహజమే. అయితే ఫలితాలు మాత్రం అందుకు పూర్తిభిన్నంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలతో ఆయా వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.

వాలంటీర్, సచివాలయ వ్యవస్థలతో రెవెన్యూ, మున్సిపల్ వ్యవస్థలు దెబ్బతింటుంటే, విద్యా వ్యవస్థతో చేస్తున్న ప్రయోగాలకి విద్యార్దులు, ఉపాధ్యాయులు కూడా మూల్యం చెల్లించుకోవలసివస్తోంది. ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి వ్యవసాయంపై పడింది. ఈరోజు రైతుల గుండెలు గతుక్కుమనేలా ఓ సరికొత్త ప్రతిపాదన చేశారు.

Also Read – ఒకే బాటలో గురుశిష్యులు… ఎవరు కాదంటారు?

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్ కంపెనీని ప్రారంభిస్తూ, “రాష్ట్రంలో గ్రీన్ ప్రాజెక్టులు స్థాపించేందుకు అదానీ వంటి అనేక పెద్దపెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కనుక దీంతో రైతులకు లబ్ది కలగాలనే ఆలోచనతో నేను రైతులకు ఈ ఆఫర్ ప్రకటిస్తున్నాను. ఈ సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీ తరపున వారితో ఒప్పందాలు చేసుకొని రైతులకు ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.30 వేలు చొప్పున అందించేలా చేస్తాను. అంతేకాదు ప్రతీ మూడేళ్ళకోసారి 5 శాతం లీజు పెంచేవిదంగా ఒప్పందాలు చేయిస్తాము. ఇది రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కనుక రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ గ్రీన్ ప్రాజెక్టుల స్థాపనకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక చోట కనీసం 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేందుకు వీలుగా రైతులను ఒప్పించి భూమి సేకరించవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ చొరవ తీసుకొని రైతులతో మాట్లాడి ఒప్పించాలి,” అని అన్నారు.

అంటే రైతుల భూములు అదానీ వంటి పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయన్న మాట! అప్పుడు రైతులకు తమ భూముల మీద యాజమాన్యపు హక్కులు కోల్పోతారు కనుక ఎంత అవసరం వచ్చినా వాటిని ఎవరికీ అమ్ముకోలేరు… కౌలుకి ఇచ్చుకోలేరు. ఆ పంటలు పండించుకోలేరు…. చివరికి భూములలో అడుగుపెట్టలేరు కూడా! ఒక పక్క భూములిచ్చిన రైతులకి నిద్రలేకుండా చేసి ఇప్పుడు ఇలా చెపితే రైతులు నమ్మే పరిస్థితి ఉందా?

Also Read – పుష్ప; తగ్గుతుందా,తగ్గిస్తున్నారా..?


ఆ కంపెనీలు ఏడాదికోసారి ఇచ్చే పరిహారం కోసం వాటి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈయకుండా అవి ఎగవేస్తే వారి గోడు వినేనాధుడే ఉండడు కనుక కోర్టుల చుట్టూ తిరగక తప్పదు. తిరగలేకపోతే భూమిని, ఆదాయాన్ని మరిచిపోవలసిందే. ఒకవేళ ఆ లీజు కాగితాలను పట్టుకొని న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాలనుకొన్నా ఓ బీద రైతు అదానీ వంటి కార్పొరేట్ కంపెనీతో న్యాయపోరాటం చేయలేడు. కనుక ఈ వ్యవసాయ భూముల లీజు ప్రతిపాదన రైతుల జీవితాలను అల్లకల్లోలం చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.