వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ ముందుకొచ్చారు అంటే ఒకటి రెండు రోజుల పాటు ఆయన చేసిన ప్రసంగాల చుట్టే ఏపీ రాజకీయాలు చక్కర్లు కొడుతుంటాయి. అటు మీడియా కు ఇటు సోషల్ మీడియా కు అవసరమైనంత ఆహారాన్ని కూడా జగన్ తన ప్రెస్ మీట్లతో వారికి అందిస్తారు.
అయితే తాజగా తాడేపల్లి ప్యాలస్ లో జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ తనను తానూ మంచివాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు అనేది ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అటు వైఎస్ జగన్ మద్దతుదారుల నుంచి ఇటు టీడీపీ నేతల వరకు జగన్ మంచితనాన్ని ఎవరి వాదనలో వారు వినిపిస్తూ వస్తున్నారు.
నేను మంచివాడిని కాబట్టే మా తాతా రాజారెడ్డి హత్యకు కారణమైన వారు ఇప్పటికి స్వేచ్చంగా టీడీపీ లో తిరుగుతున్నారని, లేకుంటే ఎప్పుడో వారి సంగతి తేలేది అంటూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇందుకు టీడీపీ నేత మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ రాజకీయాలకు భీజం వేసింది వైఎస్ కుటుంబమే అని, జగన్ బాధితుడు కాదు నిందితుడు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు పయ్యావుల.
అలాగే వివేకా నిందితుల పేర్లు ఆయన కుమార్తె సునీత చెపుతుంటే వైఎస్ జగన్ ఉలిక్కిపడుతున్నారని, ఇక జగన్ తండ్రి, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక జగన్ పాత్ర ఉందని గతంలో బొత్స సత్యనారాయణ జగన్ వైపు వేలెత్తి చూపలేదా.? అంటూ వైసీపీ కి ఎదురు ప్రశ్న వేశారు.
అలాగే వైఎస్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని గతంలో ఆరోపించిన జగన్ తన ప్రభుత్వ హాయంలో అదే రిలయన్స్ సంస్థకు చెందిన వ్యక్తికీ రాజ్యసభ సీటు ఇవ్వలేదా.? ఇప్పుడొచ్చి వైఎస్ మరణం వెనుక బాబు అంటూ సీఎం బాబు మీద ఆరోపణలు చేయడం గొడ్డలి పార్టీ రాజకీయ నైజం అంటూ పయ్యావుల జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అయితే జగన్ ప్రెస్ మీట్ పెట్టుకుని మరి తనను తానూ మంచివాడిగా చిత్రీకరించుకోవడం వెనుక పరమార్ధం ఏమిటి.? 2024 ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఉద్దేశించి వీరు సౌమ్యులు, మంచివారు వీరికి ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రజల ముందుకెళ్లారు.
అయితే ఏపీ ఓటర్లు మాత్రం జగన్ మంచివాళ్ళుగా, సౌమ్యులుగా పరిచయం చేసిన వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా చేసారు. అలాగే జగన్ చెప్పిన ఆ మంచివాళ్ళు, సౌమ్యులు నేడు ఒక్కొక్కరుగా వివిధ కేసులలో అరెస్టయ్యి జైలు జీవితం అనుభవిస్తున్నారు, బైళ్ళ మీద తిరుగుతున్నారు. ఇక జగన్ దగ్గర మంచోడిగా గుర్తిపు పొందిన విజయ్ సాయి రెడ్డి ఏకంగా వైసీపీ కి గుడ్ బై చెప్పారు.
వారిలో వల్లభనేని వంశీ మొదలుకుని, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబు, నందిగామ సురేష్, అవినాష్ రెడ్డి, దేవినేని అవినాష్…ఇలా చెప్పుకుంటు పొతే వైసీపీ లో జగన్ మెచ్చిన, ప్రజలు తిరస్కరించిన మంచివాళ్ల లిస్ట్ చాలానే ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో జగన్ కూడా చేరాలనుకుంటున్నారా.? అందుకే తనకు తానూ మంచివాడిని అంటూ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారా.?




