ఇదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన ఉండాలి. కానీ ఆయనకి సంక్షేమ పధకాలపై ఉన్న శ్రద్ద ప్రాజెక్టులపై లేకపోవడంతో గాలికొదిలేశారు.
అప్పు పట్టించుకోని జగన్, ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ పోలవరం ప్రాజెక్టు గురించి ట్విట్టర్‌లో పెద్ద లేఖ పోస్ట్ చేయడం విచిత్రంగా ఉంది.
తెలుగులో మాట్లాడటానికి తడబడే జగన్ అంత పెద్ద లేఖ తెలుగులో వ్రాశారంటే ఎవరూ నమ్మరు. కనుక వైసీపి మేధావులు తయారుచేసి ఇచ్చిన లేఖని తన పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారని అర్దమవుతూనే ఉంది.
కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు దానిలో ఏమి వ్రాసుందో ఆయన చదివిన్నట్లు లేదు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు కాగా 41.15 మీటర్లకు కుదించడానికి ఎందుకు ఒప్పుకున్నారు?అని జగన్ దానిలో ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకి ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా బదులిచ్చారు. “పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదించి, ఆ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని జగన్ కేంద్రానికి లేఖలు వ్రాసినప్పుడు, ఈ ప్రతిపాదనని టిడిపి శాసనసభలోనే తీవ్రంగా వ్యతిరేకించింది.
రాష్ట్రంలో నదులు అనుసంధానం చేయాలంటే తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉండాలని వాదించాము. కానీ ఎత్తు తగ్గిస్తే అది సాధ్యం కాదని జగన్ ప్రభుత్వానికి శాసనసభలో అర్దమయ్యేలా వివరించే ప్రయత్నం చేశాము. కానీ ఆయన మా సూచనలని పట్టించుకోకుండా 41.15 మీటర్లకు కుదించాలని కేంద్రానికి లేఖ వ్రాశారు. ఇప్పుడు ఎందుకు కుదించారని మమ్మల్ని నిలదీస్తున్నారు,” అని ఎద్దేవా చేశారు.
సిఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు పోలవరం ప్రాజెక్టుకి తీవ్ర నష్టం కలిగించాయని, ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. కానీ ఆయన చేసిన తప్పులన్నీ తాను సరిదిద్ది మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని గాడిలో పెట్టిందునే ఇప్పుడు కేంద్రం రూ.12,127 కోట్లు ఇస్తోందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అంటే తప్పులన్నీ చంద్రబాబు నాయుడు పద్దులో… ఏదైనా మంచి జరిగితే వాటిని తన పద్దులో జగన్ వ్రాసుకుంటున్నారన్న మాట!
చంద్రబాబు నాయుడుపై లేనిపోని ఆరోపణలతో అనేక కేసులు నమోదు చేసి జైలుకి పంపించిన జగన్, మరి పోలవరం ప్రాజెక్టు అవినీతిపై కూడా విచారణ జరిపించి అప్పుడే ఆయనపై కేసు పెట్టవచ్చు. కానీ ఎందుకు పెట్టలేదు?
ఆనాడు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ నిలిపివేయించి, ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో నిర్మాణ పనులకు మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచారు.
ఆ విదంగా చేస్తే పోలవరం ప్రాజెక్టు పనులు చాలా ఆలస్యమవుతాయని, నిర్మాణ అంచనా వ్యయాలు ఇంకా పెరిగిపోతాయని, కనుక రివర్స్ టెండరింగ్ అనే పిచ్చి ఆలోచన మానుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు జగన్ ప్రభుత్వానికి లేఖలు వ్రాశారు. శాసనసభలో టిడిపి కూడా వారించింది.
కానీ జగన్ వాటిని పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ చేశారు. కేవలం కమీషన్ల కక్కుర్తితోనే జగన్ అలా చేశారని టిడిపి విమర్శించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడుని నిందిస్తూ జగన్ పెద్ద లేఖ, అదీ తెలుగులో వ్రాసి పోస్ట్ చేయడం చాలా విడ్డూరంగానే ఉంది కదా?




