ఆరు నెలల పాటు కొనసాగనున్న వైసీపీ అధినేత జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ ఇడుపులపాయ నుంచి నేడు ప్రారంభంకానుంది. పాదయాత్ర సక్సెస్ కావాలని తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఆశీర్వాదం తీసుకుని ఇడుపులపాయ బయల్దేరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించిన తర్వాత పాదయాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు చేరుకొని తనను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి వీరన్నగట్టుపల్లెకు చేరుకున్న తర్వాత భోజనం చేసి, పిదప కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి వేంపల్లె క్రాస్ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపం వరకు పాదయాత్ర చేస్తారు.
దీంతో తొలిరోజు పాదయాత్ర పూర్తి కానుంది. మొదటి రోజున మొత్తం 8.9 కిలోమీటర్లు జగన్ నడవనున్నారు. యాత్ర ముగించి, అక్కడే రాత్రికి బస చేస్తారు. తొలిరోజు పాదయాత్రలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి 30 మంది హాజరవుతారని, పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తాయని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా… పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.


