నాలుగు సీట్లలో రెండు వారికే..ఇదెక్కడి సామాజిక న్యాయం?

ys_jagan_ Rajya_sabha_Seatsఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న అభ్యర్ధులను ఖరారు చేశారు. ఊహించినట్లే విజయసాయి రెడ్డికి మళ్ళీ మరో అవకాశం ఇచ్చారు. మిగిలిన మూడు సీట్లను ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు ఇచ్చారు.

నాలుగు సీట్లలో రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన రెండు సీట్లు బీసీలకు ఇచ్చి గొప్ప సామాజిక న్యాయం పాటించామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డిలకు సీట్లు కేటాయించడంతో రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిలతో కలిపి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు నలుగురయ్యారు.

ADVERTISEMENT

మొత్తం ఆరుగురిలో నలుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిని పెట్టుకొని మళ్ళీ గొప్ప సామాజికన్యాయం అని వైసీపీ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఒకవేళ వైసీపీ నిజంగా సామాజిక న్యాయం పాటించదలిస్తే ఈసారి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వవచ్చు కదా? కానీ ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ రెడ్లకే ఎందుకు ఇచ్చుకొంది?

నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరంజన్ రెడ్డి (ఆదిలాబాద్), ఆర్‌.కృష్ణయ్య (వికారాబాద్)లకు కేటాయించడాన్ని వైసీపీ నేతలు ఏవిదంగా సమర్ధించుకోగలరు?అంటే ఏపీ వైసీపీలో రాజ్యసభకు అర్హులైన అభ్యర్ధులే లేరనుకోవాలా?

వైసీపీ మహిళలకు చాలా ప్రాధాన్యం ఇస్తుందని గొప్పగా చెప్పుకొంటారు. మరి నాలుగు సీట్లలో ఒక్కటి కూడా మహిళలకు ఎందుకు కేటాయించలేదు? రాజ్యసభలో ఏపీకి ప్రాధాన్యం వహించేందుకు ఒక్క మహిళ కూడా లేకపోయినా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పురుషులు (విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి)లకే రెండు సీట్లు ఇచ్చుకోవడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలదు?

బీద మస్తాన్ రావుకి రాజ్యసభ సీటు కేటాయించడంతో లోక్‌సభ, రాజ్యసభలలో కలిపి ఒక్క నెల్లూరు జిల్లా నుంచే ఆరుగురు అయ్యారు. కనుక ఈసారి రాయలసీమ, కోస్తా జిల్లాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించి ఉంటే సమతూకం పాటించినట్లు ఉండేది కదా?

కనుక వైసీపీ కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ అవసరాలు, ప్రాధాన్యతలను బట్టి సీట్లు కేటాయించుకొందే తప్ప బీసీలను నెత్తిన పెట్టుకొనేందుకు కాదు…రాష్ట్రాన్ని ఉద్దరించేందుకు అంతకంటే కాదు.

ADVERTISEMENT
Latest Stories