రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీని గెలిపించి, తదుపరి ముఖ్యమంత్రి స్థానంలో “వైఎస్ జగన్ అనే నేను…” అంటూ ప్రమాణ స్వీకారం చేయడానికి గానూ ముందుగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర చేయడానికి ముందుగా తిరుమల విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న జగన్, ఆ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
హిందూ ఆధ్యాత్మిక, భక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలోకి అన్యమతస్తుల ప్రవేశంపై ఉన్న నిబంధన ప్రకారం… ‘హిందూ విశ్వాసాల మీద నమ్మకం ఉందని’ తెలుపుతూ ముందుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ‘వైఎస్ జగన్ అనే నేను…’ అంటూ ప్రారంభమయ్యే ఈ డిక్లరేషన్ ను ఆలయం వద్దకు జగన్ చేరుకోగానే టీటీడీ అధికారులు ఎదురెళ్ళి మరీ ఇచ్చారు.
అయితే జగన్ మాత్రం ఈ డిక్లరేషన్ ను ఇచ్చేందుకు నిరాకరించారు. టీటీడీ అధికారులపై ఒకింత ఆగ్రహంతో చూసిన జగన్, ఆ పై సున్నితంగా తిరస్కరించి స్వామి వారి దర్శనానికి వెళ్ళిపోయారు. జగన్ తో పాటు వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. పాదయాత్ర సక్సెస్ అయ్యి, తద్వారా సిఎం పీఠం అధిష్టించడమే ‘జగన్ అండ్ కో’ ఈ పర్యటన లక్ష్యం.


