జగన్‌ స్క్రిప్ట్ రైటర్ మారాడా? భలే డైలాగ్స్!

ys jagan speech at kadapa ఇదివరకు సిఎం జగన్‌ తన ప్రసంగాలలో నోరు తిరగని పదాలని పలకలేక తడబడుతూ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు వాటిని పట్టుకొని సోషల్ మీడియాలో జగనన్న నుంచి మరో ‘జ్ఞాన గుళిక’ అంటూ ఆయనని ఓ ఆట ఆడుకొంటుండేవి. కానీ ఇప్పుడు సిఎం జగన్‌ ప్రసంగాలలో పంచ్ డైలాగ్స్, మంచి ఇమ్మోషనల్ డైలాగ్స్ వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడుగా పేరొందిన త్రివిక్రం శ్రీనివాస్‌ వ్రాసే సినిమా డైలాగులకు అవి ఏమాత్రం తీసిపోన్నట్లుంటున్నాయి. ఆ డైలాగ్స్ వింటుంటే జగన్‌ తన స్క్రిప్ట్ రైటర్‌ని మార్చుకొన్నారా? అనే సందేహం కలుగుతుంది.

ఇందుకు తాజా ఉదాహరణగా నేడు కడప జిల్లాలో సిఎం జగన్‌ ప్రసంగంలో ఈ డైలాగ్ చెప్పుకోవచ్చు. ఇంతకీ జగన్‌ ఏమన్నారంటే, “ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అనే చంద్రబాబు నాయుడులాగానో లేదా ఆయన దత్తపుతుడు మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనను. ఇదే నా రాష్ట్రం. ఇక్కడే నా నివాసం… ఇక్కడే నా మమకారం… ఇక్కడి 5 కోట్ల ప్రజలే నా కుటుంబం. ఇక్కడే నా రాజకీయం… ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం,” అని అన్నారు.

ADVERTISEMENT

మరో డైలాగ్ “నాయకుడంటే విశ్వసనీయత ఉండాలి. మాట మీద నిలబడాలి. అతన్ని చూసి ప్రతీ కార్యకర్త కాలర్ ఎగరేసుకొనేలా ఉండాలి.”

మరో డైలాగ్ “మంచి చేసి మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఓ వరం. ఆ వరం కోసమే మీ ఈ బిడ్డ ప్రాకులాడుతున్నాడు.”

ఓ పక్క రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల కోసం నెలనెలా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తునారు. కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించడం లేదని కోర్టులకి వస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ దేవానంద్ నిన్ననే అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలా చేస్తున్నానంటూ జగన్‌ ఇంత చక్కగా డైలాగ్స్ చెపుతున్నారు.

తెలంగాణకి చెందిన బిఆర్ఎస్‌ పార్టీ ఏపీలో రాజకీయాలు చేయడానికి సిద్దమవుతుంటే అందుకు జగన్‌కి ఎటువంటి అభ్యంతరం ఉన్నట్లు లేదు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయాలు చేస్తే తప్పుగా కనిపిస్తోంది. టిడిపి, జనసేనలో రెండు రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనాల కోసం అవి వేటితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు. కానీ అదీ తప్పే అన్నట్లు జగన్‌ మాట్లాడుతున్నారు.

ఆయనని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా జీవించేలా చేయాలి. కానీ ఓ పక్క రాష్ట్రాన్ని అప్పల ఊబిలో కూరుకుపోయాలా చేస్తూ, ప్రజలందరూ ఎల్లప్పటికీ ప్రభుత్వం మీదే ఆధారపడేలా చేస్తున్నారు. అందుకు ప్రజలు తనని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని సిఎం జగన్‌ ఆశిస్తున్నారు. ఇది ఆశా… దురాశా?

ADVERTISEMENT
Latest Stories