ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల సభలో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు హయాంలో అన్నీ స్కాములే తప్ప ఒక్క స్కీము కూడా అమలుచేయలేదు. ఆయన దేనిపై చెయ్యి వేస్తే అదే ఓ పెద్ద స్కామ్. ఆయనకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కరువు కాటకాలే కానీ నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఏటా వర్షాలు కురుస్తున్నాయి. పాడి పంటలతో రాష్ట్రంలో సశ్యశ్యామలంగా ఉంటోంది.
మీ ఈ బిడ్డకు అబద్దాలు చెప్పడం రాదు. మేలు చేయడం మాత్రమే తెలుసు. మీ అందరికీ మీ ఈ బిడ్డ మేలు చేశాడని భావిస్తే మీరే నా సైనికులుగా కదిలివచ్చి నన్ను గెలిపించుకోవాలి. మీకు అండగా నేను… నాకు అండగా మీరు, పైన ఆ దేవుడే ఉన్నారు. నా వెనుక ఏ మీడియా సంస్థలు లేవు. ఏ దత్తపుత్రుడు లేడు. రాబోయే రోజుల్లో టిడిపి, జనసేనల నేతలు మీ ముందుకు వచ్చి ఎన్నో అబద్దాలు, మాయ మాటలు చెపుతారు. బంగారు కార్లు కూడా పంచిపెడతామని మభ్యపెడతారు. కనుక మీరందరూ అప్రమత్తంగా ఉంటూ, మళ్ళీ ఈ మీ బిడ్డను మీరే గెలిపించుకోవాలి. నేను మరెవరినీ నమ్ముకోలేదు. మిమ్మల్ని మాత్రమే నమ్ముకొన్నాను,” అంటూ చాలా చెప్పారు.
తనకు ప్రజలకు మేలు చేయడమే తప్ప అబద్దాలు చెప్పడం రాదని జగన్ చాలా చక్కగా అబద్దం చెప్పారని అందరికీ తెలుసు. ఆ అబద్దాలన్నిటినీ వివరించాలంటే ఓ పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది. కనుక క్లుప్తంగా ఆ జాబితా చెప్పుకొంటే…
1. స్కాములు చేయడం చేతకాదు.
2. అమరావతి రాజధానిగా ఉంటుంది.
3. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాము.
4. విశాఖ రాజధాని చేస్తాము.
5. త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతాను. విశాఖ నుంచే పాలన సాగిస్తాను.
6. ఋషికొండపై కడుతున్న భవనాలు పర్యాటక శాఖ కోసమే.
7. పోలవరం పూర్తి చేస్తాము.
8. నాకు మద్దతుగా ఏ మీడియా లేదు.
9. దత్తపుత్రుడు లేడు.
10. సంక్షేమ పధకాలు ప్రజలకు మేలు చేయడానికే.
11. నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే వర్షాలు కురుస్తాయి.
12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా చాలా బలంగా ఉంది.
13. వృద్ధిరేటు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఉద్యోగ కల్పనలో ఏపీ ముందుంది.
14. కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా.
15. మద్యపానం పూర్తిగా నిషేధిస్తా!




