‘మా ఇంటికొస్తే ఎం తెస్తారు…మీ ఇంటికొస్తే ఏమిస్తారు’ అనే సామెత మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కు సరిగ్గా సరిపోతుంది అనేలా ఆయన వ్యవహార శైలి కనపడుతుంది. అన్ని తనకే కావాలి, అందరు తన అభిప్రాయాన్నే బలపరచాలి అనే నియంత ధోరణిలో రాజకీయం చేస్తున్నారు.
సొంత కుటుంబసభ్యుల విషయంలో కూడా జగన్ ఇదే పంధాలో ముందుకెళుతూ సర్వత్రా విమర్శలను ఎదుర్కొటున్నారు. తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం తనకే కావాలి, అంటూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఏపీలో రాజకీయం మొదలుపెట్టారు.
ఇక ఆ తరువాత వైసీపీ బలోపేతానికి తల్లి మద్దతు తనకే కావాలి, చెల్లి షర్మిల కష్టం తనకే కావాలి అంటూ తల్లిని, చెల్లిని రాజకీయ అరంగేట్రం చేయించారు. అలాగే అటు బాబాయ్ వివేకానంద రెడ్డి సహకారం కూడా తనకు, తన పార్టీకి అవసరమని భావించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేకాను వైస్సార్ కాంగ్రెస్ లోకి తీసొకొచ్చారు.
ఇలా వైస్ కుటుంబ బలంతో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల మెప్పు పొంది 151 సీట్లతో 2019 లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ అక్కడితో సంతృప్తి చెందక వై నాట్ 175 అంటూ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు తనకే మద్దతు పలకాలి అనే నినాదాన్ని తలకెత్తుకుని దీనికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ఎన్నికల కురుక్షేత్రానికి వెళ్లారు.
అయితే అత్యాశ అత్యంత ప్రమాదకరం అనే విషయాన్ని జగన్ తెలుసుకునే లోపే వైసీపీ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వై నాట్ 175 అంటూ ప్రజాక్షేత్రంలో తిరిగిన జగన్ కు 11 సీట్లిచ్చి వై నాట్ చావుదెబ్బ అన్నట్టుగా తీర్పు వెల్లడించారు ఏపీ ప్రజలు. ఓటమితో ప్రజలిచ్చిన తీర్పుని జీర్ణించుకోలేక వై నాట్ ప్రతిపక్ష హోదా అంటూ కోర్టుకెక్కి అక్కడ ఘోర అవమాన్ని మూటకట్టుకున్నారు జగన్.
ఇక రాజకీయంగా సాధించలేనిది ఆర్థిక పరంగా సాధిద్దాం అనుకున్న జగన్ హక్కుగా చెల్లి షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తి ని ఇవ్వకుండా మొత్తం తనకే కావాలి అనేలా తల్లి, చెల్లి మీద కోర్టుకెళ్లారు. షర్మిలకు తండ్రి రాజకీయ వారసత్వంలోను హక్కు లేదని, తండ్రి ఆస్తిలో వాటా లేదని నిక్కచ్చిగా, నిస్సిగ్గుగా బహిరంగ రాజకీయం చేస్తున్నారు. ఇక తల్లి విజయలక్ష్మి మాటకొస్తే ఆమె ఎప్పుడు జగన్ వైపే నిలబడాలి అని, జగన్ అభిప్రాయాన్నే బలపరచాలి అనేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
తండ్రికి పులివెందులలో నివాళ్లు అర్పిస్తున్నారు…తల్లికి సాక్షిలో చివాట్లు పెడుతున్నారు, తండ్రి బాటలోనే నడుస్తానంటున్నారు…చెల్లికి దోవలేదన్నారు. తండ్రి మీద గౌరవం ఉందంటారు…బాబాయ్ వివేకా హత్య నిందితులకు అండగా నిలబెడుతున్నారు. దీని బట్టి చుస్తే జగన్ చెప్పేది చెయ్యరు…చేసేది చెప్పరు అనేది సుస్పష్టమవుతుంది.




