జగన్ ఎదురు చూస్తున్న రోజు… ఏపీలో అతి త్వరలో..!

ys jagan narendra modiఅవును… గత రెండు సంవత్సరాలుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్న రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి త్వరలోనే రాబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి – బిజెపి మైత్రితో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. అయితే అప్పటి నుండి కేంద్రంలో ఉన్న మోడీకి దగ్గర కావాలని జగన్ అనేక ప్రయత్నాలు చేసిన విషయం రాజకీయ సుపరిచితులకు తెలిసిందే.

అనేక మార్లు ఢిల్లీకి వెళ్ళిన జగన్, కేంద్రమంత్రులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు జగన్ ను చుట్టుముట్టిన కేసుల కోసమని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ కేసుల స్థితిగతులు ఎలా ఉన్నా… జగన్ మాత్రం మోడీకి దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదన్నది బహిరంగ విషయమే. అయితే మోడీకి జగన్ దగ్గర కావాలంటే ఏపీలో ఉన్న బిజెపి – టిడిపి బంధం తెగతెంపులు కావాల్సిందే.

ADVERTISEMENT

అందులో భాగంగానే పలుమార్లు కేంద్రం నుండి సాయం అందనపుడు ఇంకా వారి క్యాబినెట్ లో ఎందుకు కొనసాగుతున్నారని ఏపీ సర్కార్ పై విమర్శలు చేసారు. అలాగే ఏపీపై కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ, మోడీ సర్కార్ పై కనీసం ఒక్క విమర్శ కూడా చేయకుండా, కేవలం ఏపీ సిఎం చంద్రబాబునే టార్గెట్ చేసుకుని ఆరోపణలు గుప్పించారు. టిడిపి – బిజెపి బంధం బద్దలు కావడానికి సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేక పోవడంతో ఇటీవల కాలంలో కాస్త సైలెంట్ అయ్యారు.

అయితే కేంద్రం తీరుతో పూర్తి అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు సర్కార్… కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతుందన్న సంకేతాలు మీడియా వర్గాల వేదికగా బయటకు వచ్చాయి. అయితే దీనికి కౌంటర్ గా బిజెపి వర్గాలు కూడా ఏపీ వ్యాప్తంగా పలు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 24 వరకు ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న సభలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతాలు అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.

మోడీకి ఓ ఘాటు లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మీడియా వర్గాల వేదికగా వెలుగు చూసిన సమాచారానికి ఘాటుగా బిజెపి ఈ విధంగా స్పందించగా, ఒకవేళ చంద్రబాబు నిజంగానే లేఖ రాస్తే… జగన్ ఎదురు చూస్తున్న ఆ తరుణం కార్యరూపం సిద్ధించగలదన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో వైరానికి దిగేది లేదని గతంలో చంద్రబాబు స్పష్టం చేసిన నేపధ్యంలో… మోడీతో చంద్రబాబు ఎలా “డీల్” చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్రం ఇలాంటి వ్యవహార తీరును కొనసాగిస్తే… ఇప్పుడు కాకపోయినా… మరికొన్నాళ్ళకైనా బిజెపితో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories