గత కొద్దీ రోజులుగా ఏపీలో జరుగుతున్న వైస్ కుటుంబ ఆస్తి పంపకాల పంచాయితీలో న్యాయాన్యాయాలు ఎవరిదనేది కాసేపు పక్కన పెడితే అసలు ఒక కుటుంబానికి ఇన్ని లక్షల కోట్ల ఆస్తా అంటూ తెలుగు ప్రజలందరూ నోరెళ్లబెడుతున్నారు. అసలు ఇన్ని కోట్లను కుటుంబ ఆస్తులుగా చెప్పుకుంటున్న ఈ వైస్ కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
Also Read – ఎక్కడ తగ్గాలో కూటమిలో అందరూ నేర్చుకున్నట్లేనా?
వీరంతా చెపుతున్నట్టు ఇవ్వని వైస్ కుటుంబ ఆస్తులే అయితే వైస్సార్ ఎన్నికల అఫడవిట్ లో ఈ ఆస్తులకు సంబంధించిన విషయాల గూర్చి ప్రస్తావన ఎందుకు రాలేదు.? ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల సమయంలో సంపాధించిన కుటుంబ ఆస్తులేనా.? అసలు ఐదేళ్ల సమయంలో ఒక కుటుంబం ఇంతటి ఆస్తిని కూటగట్టగలిగింది అంటే అది తండ్రి ఆస్తో, కొడుకు కష్టమో, కూతురి హక్కో కాదు ఇది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఏపీ హక్కు అనాలేమో ..!
తండ్రి ముఖ్యమంత్రి కావడానికి సాయమందించని జగన్ వైస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆస్తులు కూడగట్టుకోవడంలో ఆరితేరిపోయి అప్పుడు ఆ కుటుంబానికి హీరో అయ్యారు. అలాగే తానూ ముఖ్యమంత్రి అవ్వడానికి తల్లి, చెల్లి సాయం తీసుకున్న అదే జగన్ ఇప్పుడు ఆస్తుల పంపకాలలో కొరకరాని కొయ్యగా మారి అదే కుటుంబానికి విలన్ గా మిగిలిపోయారు.
Also Read – ఏపీ రాజకీయాలను జగన్ ఓవర్ రైడ్ చేస్తున్నారా?
అయితే వైస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి చెల్లి షర్మిల కష్టం ఉంది అంటూ నొక్కి వక్కాణించిన విజయలక్ష్మి గత ఐదేళ్లు ఏపీకి జగన్ చేస్తున్న అన్యాయానికి చెల్లి బాధ్యత తీసుకోవాలి అని చెప్పలేకపోయారా.? ‘బై బై బాబు’ అంటూ నాడు షర్మిల ఇచ్చిన నినాదం చివరికి వారే ఏపీకి బై బై చెప్పే స్థితికి తెచ్చింది. జగన్ కు జై కొట్టి జగన్ చేత ఛీ కొట్టించుకుని ఏపీతో మాకేం సంబంధం అంటూ ఎదురు ప్రశ్నించిన వారికి ఇప్పుడు అదే ఏపీ అండగా నిలిచింది.
రాజధాని లేక, పెట్టుబడులు రాక, ఉద్యోగ అవకాశాలు దొరకక, అభివృద్ధి మాటవినిపించక, బూతులు తప్ప మాటలు వినిపించని సమయంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ పడిన మౌన రోధన…ఇప్పుడు విజయమ్మ పడుతున్న హృదయ రోధనకు అర్ధమవుతుందా.? నాడు వద్దనుకున్న రాష్ట్రమే నేడు చెల్లి షర్మిలకు రాజకీయ జీవితాన్ని, తల్లి విజయలక్ష్మి కి మానసిక స్తైర్యాన్ని ఇస్తుంది.
Also Read – విజయసాయి సూచన: వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలట!
అయితే నాడు పదవినడ్డు పెట్టుకుని జగన్ చేస్తున్న అరాచకాన్ని తల్లిగా విజయమ్మ అడ్డుకుని ఉంటే, చెల్లిగా షర్మిల ప్రశ్నించినట్టయితే జగన్ అసలు రంగు ఆనాడే ఇటు ఏపీ ప్రజలకు అటు వైస్ కుటుంబ సభ్యులకు అవగతం అయ్యిఉండేది. నాడు అన్యాయానికి ఓటడిగారు, అధర్మానికి పదవి కోరారు దాని ఫలితం నేడు అనుభవిస్తున్నారు. మొక్కయి వంగనిదే మానై వంగుతుందా..? ఇప్పుడు వంచడం సాధ్యమా.?
నాటి ఏపీ కార్చిన కన్నీటికి, నేటి విజయమ్మ పడుతున్న మానసిక క్షోభకు కారణం ‘ఆస్తి…అధికారమే’. సమస్య తనదాకా వస్తే కానీ అన్యాయం అంటూ గొంతు విప్పను అనుకుంటే ఆ సమస్య పరిష్కారానికి కూడా ఎవ్వరు గొంతు కలపరు. వైస్ రాజశేఖర్ రెడ్డి ‘రాజకీయ వారసత్వం’ కోసం మొదలైన ఈ జగన్నాటకం ఇప్పుడు వైస్ ‘ఆస్తుల వారసత్వం’ కోసం మలుపు తిరిగింది. ఇందులో అర్జునుడేవారో.? అభిమన్యుడెవరో.? కాలమే బదులివ్వాలి.