వైఎస్ షర్మిల ఈవారంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 18న కొడుకు రాజారెడ్డి-అట్లూరి ప్రియల వివాహ నిశ్చితార్ధం, ఫిబ్రవరి 17న వారి పెళ్ళి జరుగపబోతున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా తెలియజేశారు. కనుక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా వివాహ ఏర్పాట్ల హడావుడి వలన ఏపీ రాజకీయాలలోకి రాగలరా లేదా?అనే విషయం తెలియవలసి ఉంది.
కానీ ఆమె ఏపీ రాజకీయాలలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి, వైసీపికి చాలా ఇబ్బంది అవుతుంది. కనుక అటు కాంగ్రెస్ పెద్దలకు, ఇటు ఆమెకు కూడా నచ్చజెప్పి ఈ ఆలోచన విరమింపజేసేందుకు వైవీ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి తదితరులు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైఎస్ షర్మిల వెనక్కు తగ్గితే ఆమెకు ఈసారి కడప లోక్‌సభ సీటు ఇస్తామని ఆశజూపుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఆమె ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తే వైసీపికి ఇబ్బంది, నష్టం కలుగుతుందని అర్దమవుతోంది.
అయితే కొందరు మంత్రులు వైఎస్ షర్మిల వలన తమకు ఎలాంటి ఇబ్బంది, నష్టమూ లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ ఆమె వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయి కనుక ఆమె రాకతో వైసీపి కంటే టిడిపి, జనసేనలే నష్టపోతాయని వాదిస్తున్నారు. ఇది కూడా 175 సీట్లు గెలుస్తామనే వైసీపి భ్రమ, ఆత్మవంచన వంటిదే అని చెప్పవచ్చు.
వైఎస్ షర్మిల రాకతో ఏపీ రాజకీయ సమీకరణాలు, బలాబలాలు తప్పకుండా మారుతాయి. ఆమె వస్తే ముందుగా వైసీపిలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలు, వారి అనుచరులు, కార్యకర్తలను వెనక్కు రప్పించుకొనేందుకు ప్రయత్నించడం తధ్యం. అలాగే జగన్ పక్కన పెడుతున్నవారు, జగన్‌తో వేగలేకపోతున్నవారు, టికెట్లు ఆశించి భంగపడేవారు ఏపీ కాంగ్రెస్‌కు క్యూ కట్టడం తధ్యం.
రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పెట్టుకుపోవడంతో కాంగ్రెస్ రాజకీయ నేతలు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి నేతలు, ప్రజలు దానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న వైసీపిలోకి మారారు. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంకులోని మైనార్టీలు, క్రీస్టియన్లు, దళితులు కూడా వైసీపి నుంచి కాంగ్రెస్‌వైపు మారే అవకాశం ఉంటుంది. పార్టీలో నుంచి నేతల వలసలు, ఈ ఓట్ల చీలికతో వైసీపి నష్టపోతుందని వేరే చెప్పక్కరలేదు.
అయితే బీసీలు, ముఖ్యంగా కమ్మ, కాపు, అమరావతిని పక్కన పడేసినందుకు రైతులు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఓటర్లు టిడిపి, జనసేనలవైపు మొగ్గుచూపవచ్చు. విశాఖ రాజధాని ప్రతిపాదనే వైసీపికి విశాఖ జిల్లాలో శాపంగా మారవచ్చు.
ఈ నేపధ్యంలో వైసీపి చెప్పుకొంటున్నట్లు సంక్షేమ పధకాలే దానిని కాపాడాల్సి ఉంటుంది. కానీ రాబోయే ఎన్నికలలో అవన్నీ ఓట్ల రూపంలో మారి వైసీపికి మేలుచేస్తాయా లేక లక్షల కోట్లు ఏట్లో పిసికిన చింతపండే అవుతుందా?అనేది వైఎస్ షర్మిల ఎంట్రీ తర్వాత క్రమంగా తెలుస్తుంది.




