తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సహజంగానే ఎక్కడ చూసినా ఆ పార్టీ నేతలే కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కూడా ఆ పార్టీలో హేమాహేమీలైన నేతలు చురుకుగా రాజకీయాలలో పాల్గొంటూ నిత్యం ప్రజలకు కనపడుతుండేవారు.
కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రమే అన్నట్లుంది తప్ప ఒక్క సీనియర్ నేత ఆమె పక్కన కనపడరు.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలని ఆమె మాత్రమే వెనక్కు తీసుకువచ్చి, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేగలరనే నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు అప్పనంగా అంత పెద్ద పదవి కట్టబెట్టారు.
కానీ ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క సీనియర్ నేతను కూడా పార్టీలోకి ఆకర్షించలేకపోయారు. కనుక ఇది ఖచ్చితంగా ఆమె వైఫల్యమే అని చెప్పుకోవచ్చు. కానీ మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది.
నేటికీ వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిపైనే నమ్మకం పెట్టుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఏపీలో టీడీపీ, వైసీపీలకు మాత్రమే అవకాశం ఉంటుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందువల్లే టీడీపీతో జనసేన, బీజేపిలు కలిశాయని, అధికారంలోకి వచ్చాయని జగన్‌తో సహా వైసీపీ నేతలు అందరూ గట్టిగా నమ్ముతున్నారు.
కనుక ఈసారి వారి కూటమి అధికారంలోకి వచ్చింది కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తుందని వారు నమ్ముతున్నారు. జగన్ కూడా ఇదే చెపుతున్నారు కదా?
కనుక ఏపీ ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీని, దాని అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని నమ్ముకొని మునగడం కంటే, చావో రేవో జగన్‌ని నమ్ముకోవడమే మేలని వైసీపీ నేతలు భావిస్తుండటం వల్లనే వైఎస్ షర్మిల ప్రయత్నాలు ఫలించలేదని చెప్పవచ్చు.
కానీ ఆమె నిన్న విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించే కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో నాయకత్వ సమస్య ఉన్నందున ముందుకు సాగలేకపోతున్నాము.
కనుక భవిష్యత్‌లో ఎమ్మెల్యేలు కావాలనుకున్నవారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరండి. చివరి నిమిషంలో వచ్చి చేరి టికెట్ సాధించుకున్నా మీకు ఎటువంటి గుర్తింపు ఉండదు. పార్టీలో చేరి ఇప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే, వచ్చే ఎన్నికల నాటికి ప్రజలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికవగలరు. కనుక కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను,” అని వైఎస్ షర్మిల అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దైన్యస్థితికి వైఎస్ షర్మిల మాటలు అద్దం పడుతున్నట్లుగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఏమాత్రం ఆదరణ ఉన్నా తప్పకుండా ఈ పాటికి నేతలు చేరికలు ఉండేవి.
కానీ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదంటే, రాష్ట్రంలో దానికి చోటు లేదని అర్దం. కానీ మద్యం కుంభకోణం లేదా మరో కేసులో జగన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే వరకు ఆమె ఓపిక పట్టి, అప్పుడు వైసీపీకి గాలం లేదా వల వేసుకొని చివరి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడూ వలలో వైసీపీ చేపలు పడకపోతే వైఎస్ షర్మిల రాజ్యసభ సీటు తెచ్చుకుని తన దారి తాను చూసుకుంటే మంచిది.




