ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి గద్దె దించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా వైఎస్ షర్మిలని ఏపీకి రప్పిస్తున్నారని నేడు ఆత్మసాక్షి ఘోషించింది. రేపు వైసీపి నేతలు ఘోషించకమానరు. వారి కుట్రలలో పావుగా మారి చివరికి ఆమె కూడా బలైపోతారని వైసీపి ఆత్మసాక్షి కనిపెట్టి చెప్పింది.
కనుక ఆమె అమాయకంగా వారి కుట్రలో పావుగా మారిపోయారా లేక ఆమె తన భవిష్యత్ రాజకీయ జీవితం చక్కదిద్దుకోవడానికి పావులు కదుపబోతున్నారా?అని ఆలోచిస్తే వైఎస్ రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన వైఎస్ షర్మిల, సుమారు పదేళ్ళకు పైగా రాజకీయాలలో తిరుగుతూనే ఉన్నారు. కనుక ఆమె అమాయకురాలని అనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది.
ఆమె వైసీపిని, ఆంధ్రాను వీడి ఎందుకు తెలంగాణ వెళ్ళారో అందరికీ తెలుసు. తెలంగాణలో రాజకీయాలలో స్థానం సంపాదించుకోవడానికి ఆమె గట్టి ప్రయత్నలే చేశారు. కానీ అవి ఫలించవని గ్రహించగానే కాంగ్రెస్ అందించిన బంపర్ ఆఫర్‌ని మరో గొప్ప అవకాశంగా ఆమె గుర్తించారు. అందుకే అయిష్టంగానైనా అన్నతో రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్దమయ్యారు.
అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీకి వచ్చి మంత్రదండం తిప్పి ఏపీ కాంగ్రెస్ పార్టీని బ్రతికించేయలేననే విషయం ఆమెకూ తెలుసు. కానీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎన్నికలలో కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలుచుకున్నా తన రాజకీయ గమ్యం వైపు తొలి అడుగుపడిన్నట్లే!
ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం, ముఖ్యంగా వైసీపి నేతల్లో నెలకొన్న అసంతృప్తి తన లక్ష్యం సాధించేందుకు ఉపయోగపడుతుందని ఆమె గ్రహించారు కనుకనే ఏపీ రాజకీయాలలో అడుగుపెడుతున్నారని చెప్పవచ్చు.
ఏపీ రాజకీయాలలో ఆమె ప్రవేశిస్తే, తనకు చాలా ఇబ్బందికరంగా మారడమే కాదు… తన పార్టీ రాజకీయంగా చాలా నష్టపోతుందనే భయాందోళనలు జగన్మోహన్ రెడ్డికి ఉండటం సహజమే. కానీ సొంత చెల్లెలిపై విమర్శలు, ఆరోపణలు చేయడం వలన ప్రజలలో ఆమెకే సానుభూతి ఏర్పడుతుందనే విషయం ఆయనకు తెలుసు.
కనుక వైసీపి నేతలు చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి, బాలకృష్ణలను ఏవిదంగా చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి విమర్శిస్తున్నారో అదేవిదంగా వైఎస్ షర్మిలని కూడా జగన్ ప్రత్యర్దులతో ముడిపెట్టి విమర్శిస్తున్నట్లు భావించవచ్చు.
కానీ వైఎస్ షర్మిలకు ఇటువంటి పరిమితులు లేవనే చెప్పాలి. ఆమె అన్నతో విభేధాల గురించి మాట్లాడి అన్న తనను మోసం చేశారని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇంతకాలం అమరావతి, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలు, అప్పులు, జీతాల సమస్యలు వంటివాటి గురించి టిడిపి, జనసేన, బీజేపీ, వామపక్షాలు చేసిన విమర్శలు, ఆరోపణల కంటే వాటి గురించి సాక్షాత్ ముఖ్యమంత్రి చెల్లెలు వైఎస్ షర్మిల మాట్లాడితే ప్రజలు బాగా కనెక్ట్ అవుతారని వేరే చెప్పక్కరలేదు. అప్పుడు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి, వైసీపియే.
ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తారా? అనే సందేహాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. అయితే వైఎస్ షర్మిల ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కలతోనే ఏపీకి వచ్చారు. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించి ఆమెతో రాజీపడితేనే ఇది సాధ్యం అవుతుంది. కానీ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేన్నట్లే జగన్, షర్మిల కాంగ్రెస్‌లో సర్దుకుపోవడం కష్టమే.
కానీ భవిష్యత్ రాజకీయ పరిణామాలను బట్టి విజయమ్మ మధ్యవర్తిత్వం చేసి వారి మద్య రాజీ కుదిర్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికైతే వైఎస్ షర్మిల వలన జగన్మోహన్ రెడ్డికి, వైసీపికి ఎన్నికలలో ఎదురీత, ఎదురుదెబ్బ రెండూ తప్పవు.




