ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రత గురించి మొట్టమొదట టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు ప్రాణహాని ఉందని కనుక ఆమె సొంత జాగ్రత్తలు పాటిస్తూ, పోలీసులను భద్రత కోరాలని సూచించారు. ఇలా అన్నందుకు ‘కాలాకేయ సైన్యం’ ఆయనపై విరుచుకుపడింది.
అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల స్వయంగా తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో అయ్యన్న పాత్రుడి అనుమానం నిజమేనని స్పష్టమయ్యింది.
వైఎస్ షర్మిల బాపట్ల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న విజయవాడకు వచ్చినప్పుడు, గన్నవరం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది కనుక నా రాజకీయ శత్రువుల నుంచి నాకు ప్రమాదం ఉంటుంది. నాకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాను కానీ ఎవరూ పట్టించుకోలేదు.
ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?అంటే నాకు ఏమైనా జరగరానిది జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా? మీకు (జగన్మోహన్ రెడ్డి), మీ మంత్రులకు భద్రత కల్పించుకుంటే సరిపోతుందా? రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు భద్రత అవసరం లేదని భావిస్తున్నారా?
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలినైన నాకే భద్రత కల్పించకపోతే ఇక రాష్ట్రంలో సాధారణ మహిళలకు మీ ప్రభుత్వం ఏం భద్రత కల్పించగలదు?” అని వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకాను ఆయన ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేయబడితే, ఆయన మృత దేహానికి బ్యాండేజీలు కట్టేసి, గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారు. సునీతా రెడ్డి పట్టుబట్టడంతో పోస్టు మార్టం చేసి హత్య అని నిర్ధారించారు. కానీ 5 ఏళ్ళుగా విచారణ ముందుకు సాగనీయడం లేదు. సీబీఐకి హంతకులు ఎవరో తెలిసినా అరెస్ట్ చేయలేకపోతోంది.
ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చేశాయి. ఈసారి వైఎస్ షర్మిల ‘సైంధవుడి’లా అడ్డుపడుతున్నారు. కనుక ఆమెకు ప్రాణహాని ఉండవచ్చని అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల కూడా నాకు జరగరానిది ఏదైనా జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందా?అని ప్రశ్నించడం చూస్తే ఆమెకు కూడా తన ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన్నట్లే ఉన్నారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఆయన ఏమి చేసేవారో కానీ విజయమ్మకు మాత్రం ఇవన్నీ చూస్తూ మౌనంగా భరించక తప్పడం లేదు.




