తన భర్త వైస్సార్ మరణానంతరం తన కొడుకు కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయలక్ష్మి ఇప్పుడు కొడుకా..? కూతురా..?అనే సందిగ్ధంలో పడ్డారనే చెప్పాలి. వైస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేస్తూ కొత్త కుంపటి పెట్టుకున్న జగన్ కు మద్దతుగా ఆనాడు తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల అండగా నిలిచారు.
అయితే ఇదంతా అందరికి తెలిసిన గతమే.అన్నతో విభేదాలో,లేక తెలంగాణ లో కూడా వైస్సార్ కుటుంబమే అధికారంలో ఉండాలనే ఆశో కానీ జులై 2021 న తెలంగాణలో YSRTP ని స్థాపించి తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం స్థాపిస్తామ్ అంటూ రెండేళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన షర్మిలకు తల్లి విజయలక్ష్మి అండగా నిలబడ్డారు కానీ అన్న జగన్ పట్టించుకోలేదు.
కూతురికి మద్దతుగా తెలంగాణ రాజకీయాలలో కూడా పాగా వేయాలని చూసిన తల్లి విజయమ్మ ను వైసీపీగౌరవ అధ్యక్ష పదవి నుండి తప్పించి జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. దీనితో ఒక కన్ను తెలంగాణ ప్రజలకు మరో కన్ను ఏపీ ప్రజలకు అంకితం చేసారు విజయలక్ష్మి. అలాగే కొడుకు కూతురు చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేయడంతో తన రెండు కళ్ళు అధికార పీఠం దిశగా అడుగులు వేస్తున్నాయి అని సంబరపడిన విజయమ్మకు ఈ సారి వైస్ షర్మిల మెడలో కాంగ్రెస్ పార్టీ కండువాతో ఇరకాటంలో పడేసింది.
ఇప్పుడు అధికారంలో ఉన్న కొడుకుని అధికార పీఠం నుండి దించడానికి కూతురే సిద్దపడతున్న తరుణంలో తల్లి ఎవరి వైపు నిలబడుతుంది. జగన్ కు మద్దతుగా ముందుకొస్తారా..?లేక షర్మిల కు అండగా నిలబడతారా..?అనేది రెండు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా నేతలు వైస్ షర్మిల కు వ్యతిరేకంగా విమర్శలు మొదలుపెట్టారు.
వైసీపీ పెద్దల విమర్శలకు కౌంటర్ ఇచ్చి అటు తన భర్త గారాల పట్టి షర్మిల కు అనుకూలంగా విజయమ్మ వైకాపా నేతల మీద పోరాటం చేయగలరా..? లేక తన ముద్దుల కొడుకుని సమర్థిస్తూ షర్మిల పై ఎదురుదాడి చేస్తారా..? అనేది రానున్న రోజులలో తెలియనుంది. నారా కుటుంబాన్ని ఇరుకున పెట్టడానికి నందమూరి వారసులను తెర మీదకు తెచ్చే వైసీపీ నేతలకు ఇప్పుడు షర్మిల రూపంలో గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి.




