వైసీపీ…అనధికారికంగా ఎన్డీయే లో భాగమా.?

YSRCP BJP Support

మాకు ఏ పార్టీతో రాజకీయ పొత్తులు లేవు, ఆ అవసరం రాదు, సింహం సింగిల్ అంటూ వైసీపీ నేతలు చెప్పే సినిమాటిక్ డైలాగ్స్ కి వాస్తవంలో జరిగే పరిణామాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకపక్క తెలంగాణలో బిఆర్ఎస్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే మరోపక్క కేంద్ర బీజేపీ తో వైసీపీ తెరచాటు బంధాలను సాఫీగా ముందుకు తీసుకెళుతుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి బిల్లుకు వైసీపీ బేషరతు మద్దతు ప్రకటిస్తుంది. కనీసం ఆ బిల్లు పై వైసీపీ పార్టీ తరుపున ప్రజలలో ఉన్న అనుమానాలను కానీ అపోహలను కానీ బీజేపీ ప్రభుత్వం పెద్దల ముందుకు తీసుకెళ్లే సాహసం కూడా వైసీపీ నేతలు చెయ్యరు, చెయ్యలేరు.

ADVERTISEMENT

మొన్న టీడీపీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిన అమరావతి చట్టబద్దత కు సంబంధించిన బిల్లు పై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఆ బిల్లు పై తన వ్యతిరేకస్వరం వినిపించింది, అలాగే రాజధానిగా అమరావతి చట్టబద్దత అంశం మీద ఉభయ సభలలో జరిగిన చర్చల నుంచి వైసీపీ వాకౌట్ పేరుతో బయటకు వెళ్లిపోయింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు అమరావతి కోసం సమయాన్ని కేటాయిస్తూ రాజధానిగా అమరావతి చట్టబద్ధత కోసం బిల్లు కు మద్దతుగా చర్చలో పాల్గొని అమరావతికి అనుకూలంగా తమ ఆమోద ముద్ర వేశారు. కానీ సొంత రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ మాత్రం తన మొండి వైఖరితో వ్యతిరేక స్వరం వినిపిస్తూ,

ఆ బిల్లును అడ్డుకునేందుకు అన్ని రకాల రాజకీయ కుయుక్తులు పన్నింది. ఇక ఇప్పుడు బీజేపీ ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు పై మాత్రం బేషరతు మద్దతు ప్రకటించి మరోసారి ఎన్డీయే ప్రభుత్వంలో అనధికారిక పార్టీగా వైసీపీ తనదైన గుర్తింపు సంపాధించుకుంది.

బీజేపీ ప్రతిపాదించిన ఈ డీలిమిటేషన్ బిల్లు పై బీజేపీ మిత్రపక్షాలైన ఎన్డీయే పార్టీలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఆ జాబితాలో వైసీపీ జాడ ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. వైసీపీ పార్టీ తరుపున ఆ పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరు కూడా డీలిమిటేషన్ కు తమ మద్దతు ప్రకటించారు.

ఒకపక్క బీజేపీ రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీకి సరిసమానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, బీజేపీ తన అధికారాన్ని కాపాడుకునేందుకే డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెడుతుందంటూ బీజేపీ ప్రత్యర్థులు ఈ బిల్లు పై నిప్పులు చెరుగుతున్నాయి.

తమిళనాడు సీఎం స్టాలిన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా సైతం డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నేను సైతం అంటూ ప్రకటించి నల్ల బ్యాడ్జీల తో స్టాలిన్ తమ నిరశన తెలిపారు. అటు వైసీపీ మిత్ర పార్టీ అయినా బిఆర్ఎస్ సైతం డీలిమిటేషన్ అన్యాయమంటూ గొంతెత్తుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఒక్క వైసీపీ మాత్రం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన మాదిరి గుట్టుచప్పుడు కాకుండా బిల్లుకి మద్దతు తెలిపి బీజేపీ కి జై కొట్టేసింది.

కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పై దేశమంతా ఆమోద ముద్ర వేస్తె వైసీపీ మాత్రం ఆక్షేపించింది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును దేశమంతా ఆక్షేపిస్తుంటే వైసీపీ మాత్రం ఆ బిల్లుకు మద్దతు తెలిపింది. వైసీపీ తీసుకుంటున్న ఇటువంటి రాజకీయ విధానాలే జగన్ ను మోడీ దత్తపుత్రుడిగా చిత్రీకరిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT
Latest Stories