ఒక స్నేహంతో అభివృద్ధి.. మరో స్నేహంతో విధ్వంసం!

YSRCP-BRS Alliance Sparks Political Debate in Two States

ఇద్దరు మేధావులు కలిస్తే మంచి చర్చ జరుగుతుంది. ఇద్దరు శాస్త్రవేత్తలు కలిస్తే నూతన అవిష్కరణ జరుగుతుంది. ఇద్దరు సినీ నటులు కలిస్తే మంచి సినిమా వస్తుంది. అదే ఇద్దరు దొంగలు, హంతకులు, అవినీతిపరులు కలిస్తే?సమాజానికి చాలా ప్రమాదం కలుగుతుంది.

రాజకీయాలలో కూడా ఈ సూత్రం చక్కగా వర్తిస్తుంది. ఏపీలో టీడీపి, జనసేన, బిజేపిలు కలిస్తే అభివృద్ధి జరుగుతోంది. అలాగే ఎన్డీయేలో టీడీపి, జనసేనలు కలిసినందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శరవేగంగా అభివృద్ది జరుగుతోంది.

ADVERTISEMENT

కానీ వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీలు చేతులు కలిపితే, అమరావతి ఆగిపోయింది. పోలవరానికి బ్రేకులు పడ్డాయి. ఏపీలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెలంగాణకు తరలిపోయాయి. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంచేందుకు రాష్ట్ర విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉంచి ఎవరూ వాటి గురించి మాట్లాడలేని పరిస్థితి కల్పించారు.

వైసీపీ, బీఆర్ఎస్‌ అధినేతల మనస్తత్వం, భావజాలం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వారి మాట తీరు, అహంకారం, రాజకీయ పద్దతులు దాదాపు ఒకేలా ఉన్నాయి. పైగా వారికి ఉమ్మడి శత్రువులున్నారు. కనుక వారి మద్య స్నేహం కుదిరింది.

అందువల్లే నదీ జలాలు, రాయలసీమ ప్రాజెక్టు విషయంలో కూడా వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ఒకే మాట మీదున్నాయి. ఇప్పుడు వాటిలో ఎవరి స్క్రిప్ట్ ఎవరు చదువుతున్నారో, అమలు చేస్తున్నారో కనిపెట్టడం కొంచెం కష్టమే.

అక్కడ తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య ఆధిపత్యపోరు జరుగుతుంటే తమలో తాము తేల్చుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు, సిఎం చంద్రబాబు నాయుడుపై పడుతున్నారు. వారి రాష్ట్రంలో తెలంగాణవాదం బలంగా ఉంది కనుక దాని నుంచి రాజకీయ మైలేజ్ సంపాదించుకునేందుకు వారు చంద్రబాబు నాయుడుపై పడుతున్నారంటే అర్థం ఉంది.

కానీ ఏపీలో అటువంటి సెంటిమెంట్ ఏదీ లేదు. కనుక వైసీపీ దాని అధినేత జగన్‌ నేరుగా టీడీపి, సిఎం చంద్రబాబు నాయుడుతో అమీతుమీ తేల్చుకోవచ్చు. కానీ రాయలసీమకు చెందిన జగన్మోహన్ రెడ్డి, సీమకు నీళ్ళు ఇవ్వొద్దని చెపుతున్న బీఆర్ఎస్‌ నాయకులకు వంతపాడుతూ వారితో కలిసి సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటం చాలా శోచనీయం.

కానీ వారు వాదిస్తున్నట్లే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల మద్య బలమైన స్నేహ సంబంధాలు ఉంటే, వాటి వలన రెండు తెలుగు రాష్ట్రాలకు మేలే జరుగుతుంది కదా?

కానీ జగన్‌, కేసీఆర్‌ మద్య స్నేహం వలన ఆ రెండు పార్టీలకే నష్టమని గ్రహించడం లేదు. ఏపీని ద్వేషిస్తున్న కేసీఆర్‌తో స్నేహం చేస్తున్నందుకు జగన్‌ పట్ల ఏపీ ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుంది. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ కోసం అమరావతి, పోలవరం, పరిశ్రమలను బలిపెట్టారు. కనుక ఇప్పుడు కూడా కేసీఆర్‌ సూచనల ప్రకారమే ఏపీ అభివృద్ధికి జగన్‌ ఆటంకం కలిగిస్తున్నారని ప్రజలకు అనుమానం ఉంది.

తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉన్నందున జగన్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌ల స్నేహాన్ని అక్కడి ప్రజలు హర్షించరు. ముఖ్యంగా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు అసలే అంగీకరించరు. చంద్రబాబు నాయుడుని జగన్‌ జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్‌ వ్యంగ్యంగా మాట్లాడినందుకు బీఆర్ఎస్‌ పార్టీ ఫలితం అనుభవించింది కదా? అయినా ఇద్దరూ మారకపోతే వారి పార్టీలే ఇంకా నష్టపోతాయి.

ADVERTISEMENT
Latest Stories