పిల్లలు కూడా రప్పారప్పా… ఏం జరుగుతోంది?

Children participating in YSRCP political rallies in Andhra Pradesh

రాజకీయ నాయకులు వివిధ సందర్భాలలో రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు మంచి కలగాలని కోరుకున్నామని చెబుతుంటారు. కొత్త సంవత్సరంలో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. కానీ అంతకంటే ముందు తమకి, తమ పార్టీలకి మంచి జరగాలని మరికాస్త గట్టిగా కోరుకుంటారు. రాజకీయాలలో ఇవన్నీ చాలా సహజం.

అయితే రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడు నాయకులు, వారి పార్టీల వైఖరి అందుకు అనుగుణంగా ఉండాలి కదా? కానీ వారి వైఖరి తమకు, తమ పార్టీకి ప్రయోజనం కలిగించేవిధంగానే ఉంటోంది. ఇందుకు ఉదాహరణగా ఏపీలో వైసీపీ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఇంతకాలం వైసీపీలో నాయకులు, కార్యకర్తలు మాత్రమే చురుకుగా రాజకీయాలు చేస్తుండేవారు. ఇప్పుడు పట్టణాలు, గ్రామాలలో 15-20 ఏళ్ళ వయసున్న పిల్లల చేతికి పార్టీ జెండాలు ఇచ్చి, కండువాలు వేసి రోడ్లపైకి రప్పించి వారిచేత రప్పా రప్పా అంటూ హడావుడి చేయిస్తోంది.

చదువుకునే వయసులో ఉన్న పిల్లలకి ఇటువంటి అరాచకాలు నేర్పిస్తుండటం ఎంత దారుణం! ఇదివరకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఓ టీడీపీ వీరాభిమాని తన 7-8 ఏళ్ళ కొడుకుకి పచ్చ చొక్కా తొడిగి, చేతిలో టీడీపీ జెండాతో తీసుకువచ్చాడు.

అప్పుడు నారా లోకేష్ వెంటనే ఆ పిల్లాడి పచ్చ చొక్కా విప్పించి చేతిలో జెండా తీసుకున్నారు. పసిపిల్లలని రాజకీయాలకు దూరంగా ఉంచాలని తండ్రిని మందలించారు. కానీ జగన్, వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? అభం శుభం తెలియని పిల్లలని తన రాజకీయాలకు బలి చేస్తోంది!

తెలిసీ తెలియని వయసులోని ఆ పిల్లలు పత్రికలు, టీవీలలో తమ ఫోటోలు, వీడియోలు వస్తున్నాయనే సంతోషంతో రోడ్లపైకి వచ్చి రప్పా రప్పా అంటూ హడావుడి చేస్తున్నారు. వారు రోడ్లపై హడావుడి చేస్తుంటే, పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

కానీ ఆవిధంగా చేస్తే వారి జీవితం ఇంకా ప్రారంభం కాక ముందే నాశనం అవుతుంది. కనుక మానవతా దృక్పథంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అయితే పోలీసులు తమని అరెస్ట్ చేయకుండా విడిచిపెట్టేస్తుండటాన్ని కూడా వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

తమ వెనక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కనుక పోలీసులు భయపడి తమని విడిచిపెట్టేస్తున్నారని నమ్ముతున్నారు. వారిని ఈవిధంగా చేయమని ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలు కూడా బహుశః వారికి ఇలాగే చెప్తుండవచ్చు.

కానీ వైసీపీ రాజకీయాల కోసం భావితరం పిల్లల మనసులలో విషబీజాలు నాటుతుండటం, వారికీ ఈ వయసు నుంచే అసాంఘిక శక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తుండటం, వారి భవిష్యత్‌ని దెబ్బ తీసే పనులు చేయిస్తుండటం చాలా దారుణమే కదా?

ఇప్పటికే అనేకమంది రప్పారప్పాలపై కేసులు నమోదు చేశారు. కొత్త సంవత్సరంలో వారందరూ జైల్లో ఉంటారు. వారందరికీ జగన్ ఇచ్చిన బహుమతి ఇదేనా? చదువుకొని జీవితంలో ఎంతో పైకి ఎదగాల్సిన పిల్లల జీవితాలు కూడా తారుమారు చేసేస్తున్నారు కదా?

చేయకూడని పనులన్నీ చేస్తూ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories