జగన్‌కి ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా ఇవ్వడం లేదు కనుక శాసనసభకు రావడం లేదనే విషయం ప్రతీసారి గుర్తు చేస్తుంటారు. మీది తెనాలి మాది తెనాలి అన్నట్లు ఇది ఎమ్మెల్యేలకు మాత్రమే వర్తింపజేసి వైసీపీ ఎమ్మెల్సీలను మాత్రం మండలి సమావేశాలకు పంపిస్తుంటారు. అధినేతకు అవమానం అనిపించినప్పుడు ఎమ్మెల్సీలను కూడా పంపకూడదు కదా? కానీ పంపిస్తున్నారు.
వైసీపీ ఫ్రాంచైజ్‌లో ఉన్న ఈ రెండు టీమ్స్‌లో ఎమ్మెల్యేల టీమ్ శాసనసభకు రాదు. కనుక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
బొత్స సత్యనారాయణ కెప్టెన్సీలో రెండో టీమ్ వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే లోపల 10 నిమిషాలు ఉంటే వాకవుట్ చేసి బయట గంటసేపు గడిపి వస్తుంటారు. మండలిలో రోజూ ఇదే తంతు! ఏమంటే, మంత్రులు పార్ధసారధి, నారా లోకేష్ ఇద్దరూ అబద్దాలు మాట్లాడుతున్నారట.
అలాంటి వారి ముందు తాము ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు కనుక వాకవుట్ చేస్తున్నామే తప్ప టీ కాఫీలు తాగడం కోసమో సిగరెట్లు కాల్చుకోవడం కోసమో కాదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
వాకవుట్ చేయడం వైసీపీ సభ్యులకు ఫ్యాషన్ అయిపోయిందని మంత్రి పార్ధ సారధి అంటే, వాకవుట్ ఫ్యాషన్ కోసం కాదు అబద్దాలు చెపుతున్న మీ అధికార పార్టీకి జ్ఞానోదయం కోసమే వాకవుట్! అని బొత్స స్పష్టం చేశారు.
నేడు మండలిలో విద్యాశాఖ ఫీజు చెల్లింపులపై చర్చ జరుగుతున్నప్పుడు ఆ శాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకంగా 4,000 కోట్లుపైగా బకాయిలు పెట్టింది. ఓ మంత్రిగా ఆన్ రికార్డ్ ఈవిషయం చెపుతున్నాను,” అని అన్నారు.
దానిపై మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స మాట్లాడుతూ, “ఇది ఒట్టి అబద్దం. కేవలం రెండు వాయిదాలు మాత్రమే మేము చెల్లించాల్సి ఉంది. మాజీ విద్యాశాఖ మంత్రిగా ఈ మాట చెపుతున్నాను. కావాలంటే నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి,” అని సవాలు విసిరారు.
మంత్రి నారా లోకేష్ ఆయన సవాలుని స్వీకరిస్తున్నానని చెప్పి “రండి ఇద్దరం రికార్డ్స్ సభ ముందు పెడదాము. ఎవరు అబద్దం ఆడుతున్నారో తేల్చేసుకుందాం,” అని అన్నారు.
కానీ బొత్స సత్యనారాయణ రికార్డులు దేనికి? అధికారులను పిలవండి. నేరుగా వాళ్ళనే అడుగుదాం,” అని అన్నారు. కానీ నారా లోకేష్ అందుకు అంగీకరించకపోవడంతో బొత్స సత్యనారాయణ తన టీమ్‌తో వాకవుట్ చేశారు. పోతూ పోతూ మీ అధికార పార్టీకి జ్ఞానోదయం కోసమే వాకవుట్! అని చెప్పారు.






