
వైసీపి సీనియర్ నేతలలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరు. పైగా జగన్‌కు బంధువు కూడా. కానీ అదేమి దురదృష్టమో జగన్ ఆయన మాటకి ఎప్పుడూ విలువ ఈయలేదు. ఒకవేళ ఇచ్చినా ముందుగా ఆయనను మానసికంగా వేధించి గగ్గోలు పెట్టేలా చేసిన తర్వాత ఓదార్చి సర్దుబాట్లు చేసేవారు. అంటే మొట్టికాయ వేసి నొప్పెడుతోందా? అని అడిగిన్నట్లే అనుకోవచ్చు.
జిల్లాలో ఇళ్ళ పట్టాల పంపిణీ కావచ్చు… జిల్లా ఎప్సీ నియామకం కావచ్చు ప్రతీసారి ఆయన మీడియా ముందుకు వచ్చి మొత్తుకోవలసిందే…. తర్వాత తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు రావడం, ఓదార్చి పంపిస్తుండటం… చివరి వరకు ఇదే తంతు.
లోక్‌సభ ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డికే మళ్ళీ టికెట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదు. పైగా బాలినేని శ్రత్రువుగా భావించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిరుపతి నుంచి ఒంగోలుకి దిగుమతి చేసి టికెట్ ఇవ్వడం బాలినేని మరో పెద్ద షాక్.
అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు మాగుంట టిడిపిలో చేరిపోయి ఎంపీగా బరిలో దిగడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చేతిలో ఓడిపోవడం బహుశః బాలినేనికి చాలా ఉపశమనమే కలిగించి ఉండాలి.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
అయితే జగన్ మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఒంగోలు బాధ్యతలు అప్పగించి బాలినేని తలపై మళ్ళీ కత్తిని వ్రేలాడదీయడంతో బాలినేని మరోసారి లబోదిడిబోమంటున్నారు. చెవిరెడ్డిని అక్కడి నుంచి తొలగించాలని నియోజకవర్గం బాధ్యతలు తాను చూసుకోగలనని చెప్పినా జగన్ పట్టించుకోలేదు. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పొమ్మనకుండానే జగన్ పొగ బెడుతున్నట్లున్నారనిపిస్తుంది.
ఇదివరకు ఓసారి జగన్ ఇలాగే అవమానిస్తే బాలినేని అలిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. టిడిపిలో చేరిపోయేందుకు సిద్దపడ్డారు కూడా. కానీ అప్పుడే టిడిపిలో చేరిపోయి ఉండిఉంటే నేడు ఆయన పరిస్థితి మరోలా ఉండేది. కానీ జగన్‌ని నమ్ముకొని పదేపదే అవమానాలు, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పటికే బాలినేని తన అనుచరులను టిడిపిలోకి పంపించేశారు. తర్వాత ఆయన కూడా వచ్చేస్తారేమో?