జగన్ పిలుపు మేరకు యావత్ వైసీపీ నేతలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. నిస్సందేహంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. అందుకు వారు, వారి అధినేత జగన్ చాలా సంతోషించే ఉంటారు. కానీ వారి సంతోషాన్ని వారి సొంత మీడియా సాక్షి చానల్ 24 గంటల్లోనే ఆవిరి చేసేసింది.
వారి సొంత జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు మరో వైసీపీ జర్నలిస్ట్ కృష్ణం రాజుతో చేసిన ఇంటర్వ్యూలో ‘అమరావతి వేశ్యలకు రాజధాని’ అని చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ పరిస్థితి తారుమారు అయ్యింది. అంతవరకు వెన్నుపోటుతో ఉత్సాహంగా ఉన్న వైసీపీ నేతలు, ఇప్పుడు ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లా నేతలు ఈ వ్యాఖ్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. తమకు సాక్షి వెన్నుపోటు పొడిచింది కదా? అని వైసీపీ నేతలు బాధపడుతున్నారు.
మరో పక్క రాజధాని రైతులు, మహిళా రైతులు సాక్షి మీడియా, కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజులపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
కానీ చేసిన తప్పు ఒప్పుకుంటే అది వైసీపీ ఎందుకవుతుంది. కనుక దీనిపై కూడా విజయవాడకు చెందిన వైసీపీ నేత పోతిన వెంకట్ మహేష్ రంగంలో దిగి, “సాక్షి న్యూస్ ఛానల్లో ఎవరో జర్నలిస్ట్ వచ్చి ఏదో మాట్లాడితే దానికీ మా పార్టీకి సంబంధం ఏమిటి? అసలు అతను ఎవరు?
మొన్న మా పార్టీ నిర్వహించిన వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు విజయవంతం అవడంతో అసూయతో రగిలిపోతున్న టీడీపీ నేతలు, కొన్ని న్యూస్ ఛానల్స్ సాక్షిలో వచ్చిన కార్యక్రమం గురించి పదేపదే మాట్లాడుతూ, అతని చేత జగన్ అలా మాట్లాడించారన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే టీడీపీ ఈవిదంగా చేస్తోంది,” అని పోతిన వెంకట్ మహేష్ ఆరోపించారు.
అయితే ఆయన కూడా ఆవిదంగా మాట్లాడటం తప్పని ఖండించకపోవడం గమనిస్తే వైసీపీలో అందరూ ఇంతేనా? అనిపించక మానదు.




