మన మంత్రులు ఆలయాలకు భక్తితో వస్తారా లేక తమ పదవీ అధికార ఆడంబరాన్ని చాటిచెప్పుకోవడానికే వస్తారా? అనే సందేహం కలుగుతుంటుంది వారి తీరు చూస్తుంటే. తిరుమల శ్రీవారి ఆలయంలో నిబందనలను, గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్న భక్తులను పట్టించుకోకుండా మంత్రులు తమ అనుచర గణాన్ని వెంటబెట్టుకొని ఆలయంలో రాచమర్యాదలతో ప్రత్యేక దర్శనాలు చేసుకోవడమే ఇందుకు ఓ చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తాజాగా నిన్న సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సరిగ్గా అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సకుటుంబ సమేతంగా తన అనుచరులను వెంటబెట్టుకొని దర్శనానికి వచ్చారు. అయితే అప్పటికే ఆలయం భక్తులతో నిండి ఉండటంతో ఆలయ నిర్వాహకులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించడానికి ఇబ్బంది పడుతున్నారు. దాంతో మంత్రిగారి కనుసైగ చేయగానే ఆయన అనుచరులు, పోలీసులు రెచ్చిపోయి క్యూలైన్లో ఉన్న భక్తులను దౌర్జన్యంగా పక్కకు నెట్టేసి మంత్రిగారి కుటుంబానికి దారి కల్పించారు. వారిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మంత్రిగారి ముందు సామాన్య భక్తులు సాలిపురుగుతో సమానం కనుక వారి ఆగ్రహం మంత్రిగారిని ఏమీ చేయలేదు.
అయితే భగవంతుడి ముందు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అహం, ఆడంబరం విడిచిపెట్టకుండా సామాన్య భక్తులతో ఈవిదంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారు ఎన్ని పూజలు చేస్తే మాత్రం దానికి ఫలితం ఉంటుందా? తన భక్తులను ఈవిదంగా ఇబ్బందిపెట్టేవారిని ఆ దేవుడు కరుణిస్తాడా?



