కోనసీమ జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మద్య రామచంద్రాపురం టికెట్ పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. సిఎం జగన్మోహన్ రెడ్డి బోస్‌ను తాడేపల్లి ప్యాలస్‌కు పిలిపించుకొని అక్షింతలు వేసి పంపించినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించేశారు.
ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ జిల్లా ఇన్‌ఛార్జ్ మిధున్ రెడ్డికి ఆయన నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. ఆయన కూడా మంత్రి వేణు తీరుని తప్పు పట్టారు. నియోజకవర్గంలో తిరిగితే మంత్రి వేణుతో ఇబ్బందులు వస్తున్నాయని, పార్టీలో అనవసరంగా గొడవలు ఎందుకని పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం మానుకొన్నానని చెప్పారు.
ఇంతకు మునుపు తాను, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గంలో ఇంత అరాచక పరిస్థితులు ఉండేవి కావన్నారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలను, కార్యకర్తలనే మంత్రి వేణు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి సీనియర్ నాయకుడిని కూడా మంత్రి వేణు అవమానిస్తుండటం సరికాదని తోట త్రిమూర్తులు అన్నారు.
రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 30 ఏళ్ళకు పైగా అక్కడి ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో బలమైన అనుబందం ఉన్నప్పటికీ, మంత్రి వేణు తీరు వలన నియోజకవర్గంలో అడుగుపెట్టలేకపోతున్నాని తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వేణు నియోజకవర్గంలో తన ఇమేజ్, పోలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి ఏమేమి చేయాలో అవి మాత్రమే చేస్తున్నారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ఏమీ చేయడం లేదని, ఈ పద్దతి సరికాదని అన్నారు. మంత్రి వేణు ఇలాగే వ్యవహరిస్తుంటే రేపు ఎన్నికల సమయంలో తాను ఆదేశించినా పార్టే కార్యకర్తలు ఎవరూ ఆయన కోసం పనిచేయకపోవచ్చని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.
ఆయన చెప్పినవన్నీ సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకప్పుడు రాజకీయంగా విరోధులే కానీ ఇప్పుడు వారిద్దరి మద్య మంచి సఖ్యత ఉంది. కనుక ఆయన కోడా పిల్లి సుభాష్ చంద్రబోస్‌కే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టవచ్చు. కనుక మంత్రి వేణు కుర్చీ కింద నిప్పు రాజుకొన్నట్లే భావించవచ్చు.



