వైసీపీ ఎంతగా రెచ్చిపోతే టీడీపీ, జనసేన బంధం అంతలా బలపడుతుందని, జగన్ ఎంతలా రెచ్చకొడితే బాబు, పవన్ లు అంతగా దగ్గరవుతారని మరోసారి వైసీపీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు ఈ ఇరువురి నేతలు.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తిరుమల లడ్డు వివాదం చిలికి చిలికి కుల రాజకీయాల వరకు వెళ్ళింది, కాదు కాదు తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న రెచ్చకొట్టే రాజకీయానికి టీడీపీ కానీ జనసేన నేతలు గాని రెచ్చిపోకుండా ఉండడానికి,
వైసీపీ వేస్తున్న కుల రాజకీయ ఉచ్చులో ఈ ఇరు పార్టీల క్యాడర్ ఇరుక్కోకుండా ఉండేందుకు బాబు – పవన్ లు తమ బలమైన బంధాన్ని మరోసారి బయటకు తీశారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు.
సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వైసీపీ చేస్తున్న రెచ్చకొట్టే రాజకీయాల పర్యవసానాలు, దాని పై ఇరు పార్టీలు అనుసరించాల్సిన ఉమ్మడి కార్యచరణ వంటి అంశాలు చర్చకొచ్చినట్టు సమాచారం.
వైసీపీ, టీడీపీ – జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు రాష్ట్రంలో ఈ రెండు సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేందుకు సిద్దమైయిందని, ఆ ట్రాప్ లో పడకుండా ఇరుపార్టీల నేతలను అలర్ట్ చేయాలని, టీడీపీ, జనసేన నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భావించారు.
అలాగే తిరుమల నెయ్యి కల్తీ అంశంలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మూడు పార్టీల నేతల ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించాలని ఈ ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇక త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ పై కూడా బాబు, పవన్ చర్చలు జరిపారు. అయితే బాబు, పవన్ లను ఎలా అయినా విడగొట్టాలని, టీడీపీ, జనసేన పార్టీల మిత్ర బంధాన్ని ఎలా అయినా విచ్ఛిన్నం చెయ్యాలని వైసీపీ వేస్తున్న ప్రతి అడుగు వారి అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది, ఆ రెండు పార్టీల బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది.






