రప్పారప్పా ఇప్పుడొదబ్బా.. పోలీసులు తోలు తీస్తారు!

YSRCP Rappa Rappa Row

పుష్ప సినిమాలో పుష్పరాజ్ రప్పారప్పా అంటూ చెప్పిన డైలాగులు అభిమానులు మరిచిపోయారేమో కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలు మరిచిపోలేదు. ఎవరినీ మరిచి పోనీవ్వడం లేదు.

తమ అధినేత జగన్‌ స్వయంగా రప్పారప్పా తప్పు కాదని తేల్చి చెప్పేయడంతో వైసీపీలో అందరూ రప్పారప్పా అంటూ రెచ్చిపోతున్నారు.

ADVERTISEMENT

ఇటీవల జగన్‌ పుట్టినరోజున నడిరోడ్డు మీద మేకలు, గొర్రెల తలకాయలు నరికి ‘రప్పారప్పా ట్రైలర్స్’ చూపించారు. తాము అధికారంలోకి వస్తే ఇలాగే తలకాయలు తెగిపోతాయని జగన్‌ ఫ్లెక్సీల సాక్షిగా తెలియజేశారు.

రప్పారప్పా అవసరమేనని ప్రోత్సహించిన వారి అధినేత జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు. కానీ అయన కోసం హడావుడి చేసిన వైసీపీ కార్యకర్తలు మాత్రం పోలీస్ కేసులలో చిక్కుకున్నారు. అంతేకాదు.. ఏ ఊళ్ళో తమ ప్రతాపం, స్వామిభక్తి ప్రదర్శించారో అదే ఊర్లో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. సొంత ఊర్లో ఇంతకంటే పరాభవం ఏముంటుంది?

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు మేకపోతుని బలిచ్చి రప్పా రప్పా చేసినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి బస్టాండ్ మీదుగా వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ప్రజలను భయబ్రాంతులను చేసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అందరినీ గట్టిగా హెచ్చరించారు.

సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయంటూ ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదేమిటి?

తన పార్టీ నేతలు కత్తులు ప్రదర్శిస్తుంటే, కార్యకర్తలు రోడ్లపై తన ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి రప్పారప్పా అంటూ రెచ్చిపోయి మేకలు, గొర్రెలు నరుకుతుంటే విజయం సాధించినట్లు ఫీల్ అవుతున్నారా?ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన జగన్‌ తన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇదే నేర్పిస్తున్నారా?

జగన్‌ అనుమతి, ప్రోత్సాహం లేకుండా వారు ఆవిధంగా చేస్తారా? ఇలా చేస్తూ అందరినీ భయపెట్టి అధికారంలోకి రావాలనుకోవడం అవివేకం కాదా?

జగన్‌ కళ్ళలో ఆనందం చూడటం కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చిపోతే పోలీసులు ఇలాగే కేసులు నమోదు చేస్తారు. అప్పుడూ జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లోనే ఉంటారు. కానీ అయన కోసం ఇలా హడావుడి చేసినవారు జైల్లో ఉంటారు. ఇలాంటి కేసులలో ఏ కోర్టు వారికి బెయిల్‌ కూడా ఇవ్వదు. అప్పుడు రోడ్డున పడేవి తమ కుటుంబాలే అని గ్రహిస్తే వారికే మంచిది. జగన్‌, వైసీపీ మీద అంత భక్తి ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే 2029 ఎన్నికలలో గెలిపించుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories