చంద్రబాబు అరెస్ట్ జరిగి దాదాపు నెలరోజులు గడుస్తున్నాఅటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం మధ్యలో ప్రజలు ఇలా రాష్ట్రంలో అందరూ దాని పైనే చర్చించడం, దాని పైనే మీడియా సమావేశాలు నిర్వహించడం చూస్తుంటే వచ్చే ఎన్నికలకు ఏపీలో ఇదే కీలకమైన అంశం కాబోతుందనేది అవగతమవుతుంది.
ఇంతకీ బాబు అరెస్టులో సూత్రదారులు ఎవరు, పాత్ర దారులు ఎవరు, లబ్ది దారులు ఎవరు అనేది ‘జగమెరిగిన’ సత్యమే అయినప్పటికీ వ్యవస్థలది, అధికారులదే కీలక పాత్ర అంటూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి చెపుతున్న నంగనాచి సంజాయిషీలతో ఇప్పుడిప్పుడే సామాన్యులకు కూడా తెరలు తొలిగి ఒక స్పష్టత వస్తుంది.
మొన్న ప్రతినిధుల సభలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తనకు, బాబు అరెస్టుకు ఎటువంటి సంబంధం లేదు అని బాబు అరెస్ట్ సమయంలో నేను లండన్ లో ఉన్నాను దానికి అధికారులదే పూర్తి బాధ్యత అంటూ తనకలవాటైన ఒక పోటుని అధికారులకు పొడిచారు. దీని పై స్పందించిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు జగన్ బాబాయ్ వివేకానంద హత్య సమయంలో కూడా జగన్ ఏపీలో లేరు.
ఇలా రాష్ట్రంలో అరాచకాలకు జరిగినప్పుడల్లా జగన్ ఏపీలో లేకపోవడం యాదృచ్ఛికమా? లేక మరేదైనానా? అంటూ జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు.ఏపీ అనధికారిక ముఖ్యమంత్రి..,ప్రభుత్వ సలహదారు…అదేలేండి సకల శాఖ మంత్రి సజ్జల గారు డబ్భై ఏళ్ల వ్యక్తి , నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు, పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి, పద్నాలుగేళ్ల ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తిని ప్రభుత్వం కక్ష పూరితంగా అరెస్టు చేస్తుందా? దాని వల్ల మా ప్రభుత్వానికి ఒరిగేదేమిటి?
చంద్రబాబు అరెస్టుకి వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు! అంటూ చిలక పలుకులు పలికారు.”చెప్పేవాళ్ళకి వినేవారు లోకువా!”..,అన్నట్లు ఇలా ప్రభుత్వానికి సంబంధం లేదు, ముఖ్యమంత్రికి విషయం తెలియదు అంటే “చెప్పేవాళ్ళు వైసీపీ నాయకులైతే వినేవారు ఏపీ ప్రజలు” అనుకోవాలేమో! స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాత్రం చంద్రబాబే అన్ని తానే అయ్యి అవినీతికి పాల్పడ్డారు.
ఇందులో అధికారుల హస్తం ఏమి లేదు. అంటూ అధికారుల మీద దొంగ ప్రేమ నటించే సజ్జల అసలు విషయం మరిచి నట్టున్నారు. ఒక ప్రభుత్వంలో అధికారుల పాత్ర ఏమిటో కూడా ఈ ప్రభుత్వ సలహాదారుకి తెలియకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా? లేక ఏపీ ప్రజల దుస్థితి అనుకోవాలా?
చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వ వైఫల్యాలు కనుమరుగైపోయాయి. ప్రతిపక్షాల యాత్రలకు బ్రేకులు పడ్డాయి. విపక్ష నేతలను కేసులతో, అరెస్టులతో అణిచివేయగలిగారు.వైసీపీ ప్రభుత్వ హామీలు జగన్ ఆడిన రాజకీయ చరంగంలో ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నీరుగారిపోయింది. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి పై చర్చలు లేవు.
ఓటర్ల ఓట్లు గల్లంతవుతున్నాయి. ప్రజల సమస్యలు పక్క దారి పట్టాయి. ఒకటో మూడో మొత్తానికి రాజధాని ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఏపక్కకు పోయిందో తెలియదు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం జరుగుతుందా? రాష్ట్రంలో వీటన్నిటి చర్చలో లేకుండా చేసిన సూత్ర దారులు ఎవరో? ఈ పథకాలను అమలు పరుస్తున్న పాత్ర దారులు ఎవరో? దీని వలన లబ్ది పొందే లబ్ది దారులు ఎవరో? అర్థమైందా రాజా!



