ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్న వైసీపీ పాత్ర ఏమిటి అనేది గమనిస్తే, వైసీపీ ఏపీలో సీజనల్ పాలిటిక్స్ చేస్తుందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. సీజన్ కు తగ్గట్టుగా రంగులు మార్చుకుంటూ ఒక్కసారి రప్ప రప్ప అంటూ ముందుకెళ్తున్నారు.
మరోసారి ఓదార్పు, పరామర్శలు అంటూ సాగుతున్నారు. మరోసారి ప్రభుత్వ పెద్దల మీద బూతు రాజకీయాలు చేస్తూ వాటిని కుల రాజకీయాలుగా చిత్రీకరిస్తూ కథం తొక్కుతున్నారు. మరికొన్ని సార్లు రాష్ట్ర రాజధాని అమరావతి మీద విషం చిమ్ముతూ, రాష్ట్ర రాజధానిగా అమరావతి కాదు మావిగన్ అంటూ రాజధాని పేర్ల మీద రాజకీయం నడుపుతుంది వైసీపీ.
అయితే వైసీపీ సాగిస్తున్న ఈ సీజన్ల రాజకీయంతో ఆ పార్టీ ప్రజలలో క్రెడిబిలిటీని కోల్పోతుంది. అలాగే రప్ప రప్ప నినాదాలతో ప్రజలను భయాందోళనలోకి నెడుతుంది. ఇక వైసీపీ సాగిస్తున్న సోషల్ మీడియా విష ప్రచారాలకు హద్దే లేకుండా పోతుంది.
తల్లి విజయలక్ష్మి నుంచి చెల్లి షర్మిల వరకు, టీడీపీ, జనసేన పార్టీల అధినేత కుటుంబంలోని మహిళల నుంచి ఆయా పార్టీలలో మహిళా నేతల వరకు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న వికృత పోస్టులకు సమాజం సైతం సిగ్గుతో తలవంచుకునేలా చేస్తుంది. ఇటువంటి వైసీపీ రాబోయే రోజులలో తిరిగి అధికారం అంటూ జగన్ పాదయాత్ర 2.0 గా ప్రజల ముందుకొస్తే అందుకు ప్రజామోదం లభిస్తుందా.?
అధికారంలో ఉంటే తాడేపల్లి ప్యాలస్ రాజకీయాలు అధికారం లేకుంటే బెంగళూర్ రాజకీయాలు అన్నట్టుగా సాగుతున్న వైసీపీ రాజకీయ ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను తమ వైపుకి తిప్పుకోగలవా.? అంబటి రాంబాబు వివాదాన్ని కుల రాజకీయాలుగా చిత్రీకరించి కొన్నాళ్ల పాటు వైసీపీ ‘కాపు రాజకీయాల సీజన్’ లు నడిపింది.
దానితో ఆ పార్టీకి కానీ ఆ పార్టీ కాపు నేత అంబటి కి కానీ జరిగిన రాజకీయ లబ్ది కేవలం మీడియా అటెన్షన్ మాత్రమే. ఇక మరికొన్నాళ్లు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వ్యక్తుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టం అంటూ ‘రప్ప రప్ప సీజన్’ ను కొనసాగించారు.
దీని ఫలితంగా వైసీపీ రాజకీయాల మీద ప్రజలలో ఆందోళన రెట్టింపయ్యింది. ఇక తాజాగా రాష్ట్ర రాజధానిగా అమరావతి కి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్దత లభించిన నేపథ్యంలో ‘మావిగన్ అంటూ మరోకొత్త సీజనల్’ పాలిటిక్స్ కు తెరలేపింది.
ఇలా వైసీపీ సీజన్ల మాదిరి మూడు నెలలకో అంశాన్ని తెరమీదకు తెచ్చి దాని రాజకీయ వివాదంగా మలచి ప్రజలలో వైసీపీ పేరుని, మీడియాలో వైసీపీ రాజకీయాన్ని చర్చలోకి ఉంచుతుంది. ఈ సీజనల్ రాజకీయం వైసీపీ ని ప్రజలకు దగ్గర చేసి ఆ పార్టీని అధికారం వైపు నడిపించగలుగుతుందా.? లేదా వైసీపీ ని మరో ఎన్నికల సీజన్ వరకు ప్రతిపక్షంలోనే ఉంచుతుందా.?




