ఎవరైనా ఒక విషయాన్ని పదేపదే ఒక అంశానికే పరిమితం చేస్తూ మాట్లాడుతుంటే వారిని ఆవు పాఠం చెపుతున్నారా అంటూ ఆటపట్టిస్తుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు గమనిస్తే వైసీపీ ఆవు పాఠం స్థానంలో అమరావతి పాఠం ఉటంకిస్తుందా అన్న సందేహం కలుగక మానదు.
ఏపీలో వానలు వచ్చినా, వరదలు వచ్చినా దాన్ని అమరావతికి ముడి పెట్టి రాజధాని అమరావతి ఒక ముంపు ప్రాంతం అంటూ కథ మొదలుపెడతారు. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించినా, అభివృద్ధి పనులు చేపట్టినా,
లేదా అమరావతిలో పలు సంస్థలకు భూములు కేటాయించినా ప్రభుత్వం కేవలం అమరావతి అభివృద్ధికే కట్టుబడిందా.? రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను ప్రభుత్వం గాలికోదిలేసిందా.? లక్షల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు అవసరమా.? అంటూ మీడియా ముందుకొస్తారు.
ఇక చివరికి రాష్ట్ర రాజధానిగా అమరావతి కి కేంద్రం నుండి చట్టబద్దత లభించినా బాబు దృష్టంతా కేవలం అమరావతి సంక్షేమం కోసమేనా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇక ఇదంతా కాదు ఇరాన్ – అమెరికా యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినా అందుకు వైసీపీ ముందున్న అస్త్రం అమరావతే.
గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఇంధన కొరతతో పెట్రోల్ బంకుల ముందు క్యూలు కడుతున్నారు. అయితే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం ఫలితమే అంటూ మీడియా ముందుకొచ్చిన వైసీపీ సకల శాఖ మంత్రి సజ్జల అక్కడితో ఆగకుండా ఈ ఇంధన కొరత కు కూడా పరోక్షంగా అమరావతి పనులే కారణమంటూ అమరావతి పాఠం అందుకున్నారు.
ఏపీలో గత 5 రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు, అయినా ప్రభుత్వం ఎటువంటి సమస్య లేదంటు నటిస్తూ అమరావతికి మాత్రం పెట్రోల్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఉన్నది ఏపీ కోసమా.? లేదా కేవలం అమరావతి నిర్మాణాల కోసమేనా.? అమరావతిలో నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్ల పై ఉన్న శ్రద్ధతో కాస్తైనా సామాన్య ప్రజానీకం లేదంటూ అమరావతికి ఎటువంటి సంబంధం లేని సమస్య ను కూడా అమరావతి తో ముడిపెట్టి సజ్జల సాగిస్తున్న ఈ విమర్శలు అమరావతి పై వైసీపీ పెంచుకున్న, పెంచుకుంటున్న ద్వేషానికి నిదర్శనంగా కనిపిస్తుంది.







