ఎంత గొప్ప గాయకుడైనా పక్క వాయిద్యాలు లేకుండా పాడి ప్రేక్షకులను మెప్పించడం కష్టం. కానీ ఆ హోరు కాస్త ఎక్కువైతే ఆ పాటకి విలువుండదు.
రాజకీయాలలో కూడా పక్క వాయిద్యాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. సాధారణంగా వాటి మోతే చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏపీలో మూడు రాజధానులు, విశాఖ రాజధాని, సంక్షేమ పధకాల కోసం మోగిన ఆ మోత నేటికీ జనం చెవులలో రింగు మంటూనే ఉంది. ఇప్పుడు మావిగన్ కోసం మోగుతున్న పక్క వాయిద్యాల మోతతో జనం చెవుల నుంచి రక్తం కారుతోంది.
ఈ స్థాయిలో వైసీపీ పక్క వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఆ క్రెడిట్ తామే ఉంచుకోవాలి కదా? కానీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ జగన్‌కి శల్య సారధ్యం చేయబోయే వైసీపీ మేధావి సజ్జల రామకృష్ణా రెడ్డి, చాలా ఉదారంగా ఈ పక్కవాయిద్యాల క్రెడిట్ వైఎస్ షర్మిలకు ఇచ్చేశారు.
“ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు. కానీ ఆయనకు షర్మిల పక్క వాయిద్యం వాయిస్తుంటారు. అయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి జగన్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతుంటారు. మావిగన్ పేరుతో ఇప్పుడూ అదే చేశారు. ఇవేమీ రాజకీయాలో నాకు అర్థం కాదు,” అని సజ్జల అన్నారు.
“రాజధాని విషయంలో మాట నిలకడలేని జగనన్న ఓ బఫూన్ అన్నారామె. మీ రాజకీయ సంస్కృతిలో తుపాకులు, గొడ్డళ్ళు ఉన్నాయి కనుకనే మావి‘గన్’ అని పెట్టుకున్నారు. కనుక పులివెందులకి కూడా ‘ఏవి (అవినాష్) గొడ్డలి’ అని పెట్టుకుంటే బాగుంటుంది,” అని షర్మిల వ్యంగ్యంగా అన్నారు.
ఆమె రాజధాని విషయంలో జగన్ వైఖరిని తప్పు పడుతూ ఆక్షేపిస్తే, వైసీపీ నేతలు ఆమెకు సూటిగా సమాధానం చెప్పాలి. కానీ చెప్పలేకపోతున్నారు.
ఎందుకంటే మాట తప్పని, మడమ తిప్పని తమ అధినేత జగన్ రాజధాని విషయంలో ఇన్నిసార్లు మాట ఎందుకు మార్చారో చెప్పుకుంటే వారి పరువే పోతుంది కనుక!
కనుక జగన్ వైఖరిని తప్పు పట్టడం, విమర్శించడం అంటే చంద్రబాబు నాయుడుని సమర్ధించినట్లే అని సిద్దాంతం తయారు చేసుకొని అందరూ కలిసి జగన్‌కి ఇలా పక్క వాయిద్యాలు వాయించేస్తున్నారు.
పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు పక్క వాయిద్యాలు వాయించే వైసీపీ నేతలకి లోకంలో అందరూ పక్క వాయిద్యాలు వాయించేవారిగా కనపడటం సహజమే. అర్థం చేసుకోవాలి.




