ఏ రాష్ట్రం, దేశంలోనైనా రాజకీయ సుస్థిరత, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సహకాలు, వ్యాపార అనుకూల పరిస్థితి.. వంటివన్నీ ఉన్నాయని గట్టిగా నమ్మితేనే పెట్టుబడుదారులు ముందుకు వస్తారు. లేకుంటే మొహం కూడా చూడరని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. అనేక సమస్యలతో సతమతమయిన ఆంధ్రప్రదేశ్‌కి మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తుండటం చాలా శుభ పరిణామమే.
తాజాగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ (పీజీఈఎల్) రూ.1,000 కోట్లు పెట్టుబడితో తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ తయారుచేసే కర్మాగారం ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి శ్రీసిటీలో 50 ఎకరాలు భూమి కేటాయించింది.
వచ్చే ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తిచేసి, డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్లు ఆ సంస్థ ఎండీ (ఆపరేషన్స్) వికాస్ గుప్తా తెలిపారు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్న ఈ ప్లాంట్‌లో ఏడాదికి 12 లక్షల ఏసీలు తయారు చేయబోతున్నామని తెలిపారు.
వీటిలో సుమారు 50 శాతం విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నామని తెలిపారు. తమ ప్లాంట్‌లో మొదటి దశలో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని వికాస్ గుప్తా చెప్పారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు విశాఖపట్నం వరకు లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అవన్నీ వివిధ దశలలో ఉన్నందున, రాబోయే 1-2 సంవత్సరాలలో వాటి నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించవచ్చు.
అప్పటి నుంచి రాష్ట్రంలో క్రమంగా మార్పులు కనిపిస్తాయి. వీటితో భారీగా ఉద్యోగాలు, ఉపాది లభిస్తాయి. వీటి వలన రియల్ ఎస్టేట్, రవాణా, హోటల్, మెడికల్ తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. దాంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో మార్పు, మంచి వృద్ధి కనిపిస్తుంది.






