ఏదొక వివాదంతో బాలీవుడ్ సినిమాల మాదిరే టాలీవుడ్ మూవీస్ కు కూడా ఫ్రీ పబ్లిసిటీ లభించడం పరిపాటిగా మారిపోతోంది. ఇటీవల “దువ్వాడ జగన్నాధమ్” పాట విషయంలో చెలరేగిన వివాదం, చివరికి దర్శకనిర్మాతలు వెనక్కి తగ్గే వరకు చేసింది. అయితేనేం… కావల్సినంత పబ్లిసిటీ ఈ సినిమా సొంతమైంది. అయితే ఈ సారి గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” సినిమా ఆర్ధిక వివాదాలతో వార్తల్లో నిలిచింది.
అసలు విడుదల అవుతుందో, కాదో అనుకున్న ఈ సినిమా అనేక వాయిదాల తదనంతరం జూన్ 9వ తేదీకి వాయిదా పడింది. ఈ సారి రిలీజ్ పక్కా… అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఇటీవల ఏర్పాటు చేసి, కాస్త హంగామా చేసారు. అయితే ఏ మాత్రం బజ్ లేనటువంటి ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకున్నా, లేకున్నా తాజాగా ఓ ఎన్ఆర్ఐ మాత్రం సీసీఎస్ లో ఫిర్యాదు చేసారు.
ఈ చిత్రం కోసం నిర్మాత సి.కళ్యాణ్ 6 కోట్లు తన వద్ద తీసుకుని మోసం చేశారని సహదేవ్ అనే ఓ ఎన్ఆర్ఐ సీసీఎస్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సారైనా విడుదల అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉండగా, ఈ లోపున మ్యాటర్ సెటిల్ అవుతుందో లేదో చూడాలి. గతంలో కూడా కళ్యాణ్ పై ఇలాంటి ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే.



