“సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా హిందీలో కూడా విడుదల అవుతుండడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయాల్సిన బాధ్యతను పవన్ నెత్తికెత్తుకున్నారు. సహజంగా సినీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే పవన్, హిందీ ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాకపోవడంతో పలు జాతీయ మీడియా ఛానల్స్ కు తన అనుభూతులను పంచుకోవాల్సి వస్తోంది. ఇటీవలే ఓ ఎంటర్టైన్మెంట్ వెబ్ మీడియా జర్నలిస్ట్ కు తన మనోగతాలను వెల్లడించిన పవన్, తాజాగా మరో హిందీ మీడియా ప్రముఖుడు అజయ్ బ్రహ్మాత్యాజ్ తో తన భావాలను పంచుకున్నారు.
‘తెలుగులో ఎన్టీఆర్ ను మించిన నటుడు మరొకరు లేరు, ఆయనకు ఆయనే సాటి, తెలుగు వరకు తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని,’ అయితే తన అన్నయ్య చిరంజీవికి కూడా తానూ వీరాభిమానిని, క్రేజ్ లో అన్నయ్యతో పోటీ పడే అవకాశం ఎవరికీ లేదని, హిందీలో అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టమని, ‘షోలే’ సినిమాలో ‘జో డర్ గయా… ఓ మర్ గయా…’ డైలాగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన పవన్… బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, నిషికాంత్ కామత్ వంటి దర్శకులంటే తనకు ఏంటో గౌరవమని, వాళ్ళ దర్శకత్వంలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోకి వెళ్తాను… ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాను అంటూ పవన్ చేసిన ప్రకటనలు పవర్ స్టార్ అభిమానులను బాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిని సవరిస్తూ బాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పి, వాళ్ళ డైరెక్షన్ లో చేయాలని చెప్పడంతో పవన్ మరిన్ని సినిమాలలో నటిస్తారన్న నమ్మకాన్ని అభిమానులకు కలిగిస్తోంది. అయితే ఇక్కడ పవన్ చెప్పిన నిబంధన ఏమిటి అంటే…. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, నిషికాంత్ కామత్ వంటి దర్శకుల పేర్లు మాత్రమే చెప్పారు. మరి అవార్డ్ విన్నింగ్ సినిమాలను తీసే అనురాగ్, విశాల్ లు పవన్ తో సినిమాను చేయడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ సదరు దర్శకులు ముందుకు వస్తే… పవన్ అభిమానులకు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్లే కదా…!



