మళ్ళీ మనమే అనే భ్రమ కంటే.. ఓడిపోతే అనే భయమే మంచిది!

Debate over Amaravati, Kaleshwaram and Musi projects highlighting development and corruption allegations in Indian state politics.

ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే కనీసం లక్ష కోట్లు విలువ గల కొత్త ప్రాజెక్టులు ప్రకటించి చేపడుతున్నాయి. దేశం, రాష్ట్రం అభివృద్ధి గురించి ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచనలు చేస్తుండటం చాలా అభినందనీయమే.

అయితే అభివృద్ధి పేరుతో ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా సమాంతరంగా వినిపిస్తూనే ఉంటాయి.

ADVERTISEMENT

గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి, కేసీఆర్‌ కాళేశ్వరం మొదలుపెట్టినప్పుడు ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి.

కమీషన్లు, అస్మదీయులకు లబ్ది చేకూర్చడానికే భారీ ప్రాజెక్టులకు సిద్దమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనుక అభివృద్ధి, అవినీతి అవిభక్త కవలలనుకోవచ్చు.

కాళేశ్వరంని కేసీఆర్‌ మూడేళ్ళలోనే కడితే మూడేళ్ళకే క్రుంగింది. దాని దిగువనున్న బ్యారేజీల గోడలు కూడా బీటలు వారడంతో ఆ లక్ష కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం పడుంది. కనుక అది అవినీతి, అక్రమాలకు అతి పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది.

అమరావతి విషయంలో కూడా ఇలాంటి అవినీతి ఆరోపణలు చాలానే వచ్చాయి. కానీ అక్కడ కూటమి ప్రభుత్వం నిర్మించిన శాసనసభ, సచివాలయం, హైకోర్టుతో సహా పలు భవనాలు గత 10 ఏళ్ళుగా ప్రభుత్వాలు వాడుకుంటూనే ఉన్నాయి.

అలాగే 5 ఏళ్ళపాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న అనేక భవన సముదాయాలు, నీళ్ళలో మునిగున్న పునాదులు సైతం పటిష్టంగానే ఉన్నాయి. మళ్ళీ వాటిపైనే నిర్మాణాలు జరుగుతున్నాయి.

ప్రపంచానికి ట్రంప్‌ కలిగిస్తున్న నష్టం కనిపించే దాని కంటే కనిపించని నష్టమే ఎక్కువ. అదేవిధంగా అమరావతి విషయంలో జరిగిన దుబారా కంటే జగన్‌ ప్రభుత్వం 5 ఏళ్ళు పాడుబెట్టడం వలన కలిగిన కనిపించని నష్టమే చాలా ఎక్కువ.

కానీ జగన్‌ గురించి ఏ మాటకామాట చెప్పుకోవాలి. కృష్ణానదికి ఓ కరకట్ట, ఆ చేత్తోనే రుషికొండ ప్యాలస్‌ కట్టించి అదే అభివృద్ధి అనుకోమని సరిపెట్టేసి, సంక్షేమ పధకాలతోనే 5 ఏళ్ళు గడిపేశారు. కనుక అభివృద్ధి పేరుతో జగన్‌ అవినీతికి పాల్పడ్డారని ఎవరూ ఆయనని వేలెత్తి చూపలేరు!

అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడితే దానిని దాచాలన్న దాచలేరని అది కాళేశ్వరంలా బయటపడుతుందని, దాంతో ప్రభుత్వాలు కూలిపోతాయని స్పష్టమైంది.

కనుక అమరావతి, పోలవరంతో సహా రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి పనీ పూర్తి పారదర్శకంగా జరిగేలా కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అంతేకాదు… ‘2019లో కూడా మళ్ళీ మనమే’ అనే గుడ్డి భ్రమతో వెళ్ళి గోతిలో పడినట్లుగా, మళ్ళీ ‘2029లో మళ్ళీ మనమే’ అనే గుడ్డి భ్రమతో విలువైన సమయం వృధా చేయకుండా, ‘2029లో మనం దిగిపోతే?’ అనే భయం, ఆలోచనతోనే మొదలుపెట్టిన ప్రతీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడు వాటిని చూసి ప్రజలు కూటమికి మరోసారి అవకాశం ఇస్తారు.

ADVERTISEMENT
Latest Stories