కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలకం కావడంతో అమరావతి నిర్మాణానికి ఉదారంగా ఆర్ధిక సాయం అందిస్తుందని అందరూ భావించారు. అమరావతికి రూ.15,000 కోట్లు ప్రకటించింది. కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పుగా ఇప్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారెంటీగా ఉంటుంది అంతే. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోవడం కష్టమే కానీ మరో గత్యంతరం లేదు కనుక అప్పును కూడా సంతోషంగా స్వీకరించాల్సిందే.
ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అధికారుల బృందం అమరావతిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించి వెళ్ళారు. వచ్చే నెలాఖరులోగా రూ.15,000 కోట్లు నిధుల విడుదల కావచ్చని సమాచారం. కనుక ముందుగా కేంద్రం నుంచి దానిలో అడ్వాన్స్ తీసుకొని డిసెంబర్ నుంచి అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అమరావతిలో తుప్పలు, పిచ్చి మొక్కలు తొలగించి నిర్మాణ పనులకు సిద్దం చేస్తున్నారు. అలాగే పునాదుల చుట్టూ పేరుకుపోయిన నీళ్ళు కూడా మోటర్లు పెట్టి తోడి పోస్తున్నారు.
ఇదివరకు భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం వంటి కొన్ని పనులు మాత్రమే సమాంతరంగా జరిగేవి. కానీ ఈసారి వీలైన పనులన్నీ ఒకేసారి జరిపేందుకు వీలుగా మునిసిపల్ మంత్రి నారాయణ గుత్తేదారు సంస్థలతో మాట్లాడుతున్నారు. కనుక త్వరలోనే మళ్ళీ అమరావతిలో భవన నిర్మాణ యంత్రాలు, నిర్మాణ కార్మికులతో సందడిగా మారబోతోంది.
ముందు అనుకొన్న ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం పూర్తిగా అవ్వాలంటే మరో 5-7 ఏళ్ళు పట్టవచ్చు. కానీ వచ్చే ఏడాది దసరాలోగా వినియోగంలో తీసుకురాగల భవనాలు, రోడ్లకి తొలి ప్రాధాన్యం ఇస్తూ ఓ పద్దతి ప్రకారం నిర్మాణ పనులు చేయాలని మంత్రి నారాయణ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా 90 శాతం, 60-70 శాతం నిర్మాణాలు పూర్తయిన భవనాలలో మిగిలిన పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి నారాయణ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది దసరా నాటికి అమరావతి రూపురేఖలు మారిపోయి ప్రజలతో కళకళలాడే అవకాశం ఉంది.




