నవరత్నాలలో భాగంగా వైసీపీ అమలు చేసిన ‘అమ్మ ఒడి’…సూపర్ సిక్స్ హామీలో భాగంగా టీడీపీ అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పై నేడు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ చర్చ నడుస్తుంది. అయితే ఈ రెండు పథకాల్లో ప్రభుత్వాల నుండి లబ్ది పొందిన, పొందుతున్న తల్లుల్లు దాదాపు ఒక్కటే అయినా కూడా వైసీపీ, టీడీపీ మధ్య ఎందుకంత రాజకీయ నిప్పు రాచుకుంటుందో చూద్దాం.
ఏడాదికి 15 వేలు చొప్పున కుటుంబంలో ఒకరుంటే 15, ఇద్దరుంటే 30 వేలు అంటూ 2019 ఎన్నికలలో భారతి చేసిన ప్రచారాలు, వైసీపీ నవరత్నాలలో ఒకటైన అమ్మ ఒడి చివరికి వైసీపీ అధికారంలోకి వచ్చాక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మ ఒడి అంటూ ముందుకెళ్లింది.
అలాగే కనీసం ఇద్దరినీ ఒక్కరికి కుదించినప్పటికీ హామీలో ఇచ్చిన ప్రకారం లబ్దిదారులకు 15 వేలు అయినా చెల్లించారా అంటే ఆ మొత్తంలో 2 వేలు స్కూల్ మైంటెనెన్సు కు కట్ చేసి 13 వేలతో సరిపెట్టారు. అయితే నాడు వారి చర్యలను సమర్ధించుకున్న వైసీపీ నేడు అదే చర్యలను కొనసాగిస్తున్న టీడీపీ పై నిందలు వేస్తూ మంత్రి లోకేష్ కు అవినీతి మరకలు అంటిస్తున్నారు.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో టీడీపీ సూపర్ సిక్స్ లో ఒకటైన తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనిషికి 15 వేలు చొప్పున ఆయా తల్లుల ఖాతాలో జమచేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఆ మొత్తంలో 2 వేలు మైంటెనెన్సు కు కట్ చేసి 13 వేలు చొప్పున జమ చేస్తున్నారు.
అయితే వైసీపీ హయాంలో కుటుంబంలో ఒక్క విద్యార్థికి మత్రమే ఈ అమ్మ ఒడి అందితే ఇప్పుడు టీడీపీ హయాంలో ఈ సంఖ్యకు పరిమితి లేదు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు స్కూల్ కి వెళితే అంతమందికి తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలో కనిష్టం 13 వేలు గరిష్టం అన్ లిమిటెడ్ అన్నట్టు సాగుతుంది.
తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఆధారంగా ఒక ఉమ్మడి కుటుంబంలోని 12 మంది విద్యార్థులకు గాను మనిషికి 13 వేలు చొప్పున 1,56,000 వారి తల్లుల ఖాతాలో జమ చేయబడ్డాయి. అయితే ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య కుదించారు, ఒక్కో విద్యార్థి ఖాతాలో నుంచి 2 వేలు మాయం చేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ విమర్శలుగానే ప్రజలు పరిగణిస్తున్నారు.
గతంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్యలో మార్పు లేదు కానీ లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే మొత్తం డబల్, త్రిబుల్ అయిన మాట వాస్తవం. అయితే ఏపీ ప్రస్తుతం ఎదుర్కొటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనం హామీ అమలు తలకు మించిన భారమే అయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ జూన్ 12 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున మొత్తం 8745 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేసారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వం లో కంటే ప్రస్తుత ప్రభుత్వం లో ఈ పథకం కింద లబ్ది పొందే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఇక్కడ టీడీపీ కి వైసీపీ మధ్య ఉన్న తేడా ఏంటి అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్ పథకాల అమలు కు ‘బటన్’ నొక్కుడు కార్యక్రమానికి గాను ప్రజల సొమ్ముతో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థి పార్టీల నేతల పై పిల్లల సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగేవారు. అలాగే ఇచ్చిన ప్రతి రూపాయికి రెట్టింపు స్థాయిలో ప్రచార ఆర్భాటాలు నిర్వహించేవారు.
స్కూల్ పిల్లలకు అందించే చిక్కి నుంచి వారి బాగ్స్, బెల్ట్, పుస్తకాలు ఇలా ప్రతి దాని మీద జగన్ ఫోటోలను ముద్రించి వైసీపీ పార్టీకి పరోక్ష ప్రచారం కల్పించుకునే వారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్ ప్రచారాలకు కాదు ఫలితాల మీద ద్రుష్టి పెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
పిల్లలకు ప్రభుత్వాల నుంచే అందే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా రాజకీయ ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండాలి అంటూ మంత్రుల ఫొటోలో, ముఖ్యమంత్రి ఫోటో నో కాకూండా ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రను ప్రచురిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తల్లికి వందనం…అమ్మ ఒడి మధ్య కనిపిస్తున్న తేడా వైసీపీ చూడలేకపోతున్నా ఏపీ ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నారు.




