రాజధానికి భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చెలగాటమా?

Amaravati-Farmers-Protest-దేశంలో ఎక్కడైనా ఓ పాఠశాలకో ఆసుపత్రికో ఎవరైనా భూమి లేదా డబ్బు విరాళంగా ఇస్తే అందుకు కృతజ్ఞతగా వారి పేరు వివరాలతో ఆవరణలో ఓ బోర్డు ఏర్పాటు చేస్తారు వీలైతే వాటికి దాతల పేర్లు కూడా పెడుతుంటారు. దేవాలయాలలో నిత్యాన్నదానం కోసం ఎవరైనా ఓ పది లక్షలు విరాళం ఇస్తే ఆ దాతల పేర్లను బోర్డుపై వ్రాసి ఆ విషయం అందరికీ తెలిసేలా చేస్తారు.

కానీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ జీవనోపాధి అయిన వ్యవసాయ భూములు ఇచ్చిన రైతులతో జగన్ ప్రభుత్వం ఏవిదంగా వ్యవహరిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం రైతుల కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోకపోయినా వారిని కనీసం గౌరవించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది.

ADVERTISEMENT

ఏడాదిన్నరగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నా, వారికి కూతవేటు దూరంలో సచివాలయంలో కూర్చోనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడూ వారి వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం వారిని తన వద్దకు రప్పించుకొని మాట్లాడే ప్రయత్నం చేయలేదు!

పైగా వారిచ్చిన భూములలోనే నిర్మించిన సచివాలయం, శాసనసభలో కూర్చొని వారిని ఓ కులానికి చెందినవారనో లేదా ఓ పార్టీకి చెందినవారనో అభివర్ణిస్తూ అవమానిస్తుంటారు. వారిచ్చిన భూములనే అమ్ముకొని డబ్బు చేసుకొంటూ, వారి భూములలోనే గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను లీజుకి ఇచ్చుకొంటూ వారినే అవమానిస్తోంది.

రాజధాని నిర్మించకపోగా జగన్ ప్రభుత్వం తమను అవమానిస్తున్న తీరు చూసి రాజధాని కోసం తాము చేసిన త్యాగాలు వృధా అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఓ గొప్ప రాజధాని ఏర్పడాలనే సదుద్దేశ్యంతో తమకు ప్రాణంతో సమానమైన బంగారం పండే తమ వ్యవసాయ భూములను ఇచ్చి, తమ జీవనోపాధి అయిన వ్యవసాయాన్ని కోల్పోయి అష్టకష్టాలు పడుతుంటే, జగన్ ప్రభుత్వం తమపై ఆంక్షలు విధిస్తూ, తమపై అక్రమ కేసులు బనాయించి వేదిస్తూ తమ జీవితాలు నరకం చేసిందని రాజధాని రైతులు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. జీవనోపాది కోల్పోయిన తమకు గత ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం కౌలు చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు ఏడాదిన్నరగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం తీరు మారకపోవడంతో వేలాదిగా రైతులు తుళ్ళూరులో పాదయాత్రగా తరలివచ్చి సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు కౌలు పరిహారం ఇప్పించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మూడేళ్ళు చాలా ఓపికగా ఎదురుచూశామని ఇంకా ప్రభుత్వం తమని మోసం చేయాలని ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు.

అయితే ప్రభుత్వ వైఖరి మారదని వారికి కూడా తెలుసు. కనుక వారి రోదన అరణ్యరోదనే అవుతుంది. వైసీపి ఎంపీ రఘురామకృష్ణ రాజు చెప్పిన్నట్లు వారిని ఆదుకొనేందుకు ఏ శ్రీకృష్ణుడు రాడు.

ADVERTISEMENT
Latest Stories