
తెలుగుదేశం ఎన్నికల హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేది ఒకటి. దీనిపై ఇప్పటికే ఓ మంత్రి ‘త్వరలోనే అమలుచేస్తాం’ అని చెప్పడంతో ఆగస్ట్ 15 నుంచి అమలుచేయవచ్చని ఊహాగానాలు వినిపించాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఈ పధకం సాధక బాధకాలు చూస్తున్నందున ఏపీ ప్రభుత్వం ఈ పధకం అమలుకి తొందరపడటం లేదు.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
ఈ నెల 20తో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది. కనుక ఆరోజు నుంచి అమలుచేసే అవకాశం ఉందని మరో మీడియా లీక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే నేడు సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఈ హామీ అమలుపై చర్చ జరిగిన్నట్లు తెలుస్తోంది. కనుక నేడు ఈ పధకానికి ఆమోదముద్ర వేసిన్నట్లయితే నేడు సమావేశం ముగిసిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు లేదా మంత్రులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలైన మంత్రివర్గ సమావేశంలో ముందుగా కొత్త మద్యం విధానంపై మంత్రుల ఉపసంఘం ఇచ్చిన నివేదిక దానిలో సిఫార్సులపై చర్చించిన్నట్లు తెలుస్తోంది. అదేవిదంగా నూతన ఇసుక విధానం, వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధికసాయం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన్నట్లు సమాచారం. కనుక సమావేశం ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడితే వీటన్నిటిపై పూర్తి స్పష్టత వస్తుంది.