ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుకు టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం. దీనితో ఏపీ ప్రభుత్వానికి టెండర్ల ద్వారానే మంచి కిక్కెక్కించేంత ఆదాయం సమకూరింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే నిర్వహించిన వైన్ షాపులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడంతో వైన్ షాపులకు విధించే దరఖాస్తు రుసుము నాన్ రిఫండల్ 2 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం.
దీనితో ఏపీ ప్రభుత్వానికి లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా దాదాపు 1000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. అయితే గత ఐదేళ్లుగా ఎటువంటి వ్యాపారాలకు నోచుకోని టీడీపీ నేతలు ఇప్పుడు ఈ మద్యం దుకాణాల మీద కన్నేశారని, అందులో భాగంగానే వీరంతా సిండికేట్ గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారనే అభిప్రాయం కూడా ప్రభుత్వ పెద్దలలో వినపడుతుంది.
ఈ నేపథ్యంలోనే మద్యం టెండర్ల అప్లికేషన్ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ నెల 9 రాత్రికి ముగిసే గడువు సమయం 11 కి చేరింది. అలాగే వాటిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసే తేదీ కూడా 11 నుంచి 14 కి మారింది. అలాగే ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త వైన్ షాపుల లైసెన్సు పిరియడ్ ప్రారంభం కానున్నాయి.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3300 పైగా ఉన్న మద్యం దుకాణాలకు గాను ఇప్పటికి 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.అలాగే ఈ అప్లికేషన్ గడువు మరో రెండు రోజులు పెరగడంతో అటు దరఖాస్తుల సంఖ్యలోనూ ఇటు టెండర్ల రుసుముతో మరిన్ని మ్యాజిక్ నెంబర్లు కనపడే అవకాశం లేకపోలేదు.
మద్యం రేట్లు తగ్గించి మందుబాబులకు, అప్లికేషన్ రుసుము పెంచి మద్యం వ్యాపారులకు, గడువు తేదీని పెంచి ప్రభుత్వానికి ఇలా అమ్మే వారికీ, కొనే వారికే కాదు అనుమతులు ఇచ్చే వారికీ కూడా “మద్యం” మంచి కిక్కేస్తుందన్నమాట.




