ఏక్ దిన్ కా సుల్తాన్ తరహాలో రెండున్నరేళ్ళ మంత్రిగిరి విధానం ఏపీలో విజయవంతంగా అమలు చేసి ఏపీ ప్రభుత్వం దేశంలో మిగిలిన రాష్ట్రాలలో రాజకీయ నిరుద్యోగం రూపుమాపేందుకు సరికొత్త మార్గం చూపినందుకు అభినందించవలసిందే.
ఇక వేసవి వేడికి తోడు అసమ్మతి సెగల వేడి సోకుతున్నా అంగరంగ వైభవంగా మంత్రుల ప్రమాణస్వీకారాలు సాగాయి. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు వరుసగా కోట్లాది ఆంద్ర ప్రజల ఆత్మాభిమానాన్ని జగనన్న పాదాలకు సమర్పించుకొన్నారు. అది చూసి ఆంధ్ర ప్రజలు కన్నీళ్ళు పెట్టుకొంటే అది వారి తప్పు కాదు. ఆ తరువాత కొద్ది సేపటికే మంత్రులకు శాఖలను కూడా జగన్న వడ్డించేశారు.
మొదట మంత్రి పదవి దొరికితే చాలనుకొన్నవారు తమకు కేటాయించిన శాఖలను చూసి మొహం మాడ్చుకొని చేతులు పిస్సుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది వేరే సంగతి. ఏ రాష్ట్ర ఆభివృద్ధికైనా ఐటి, పరిశ్రమల శాఖల చాలా కీలకమైనది. ఆ శాఖను గుడివాడ అమర్నాథ్‌కు కేటాయించారు. చాలా సంతోషం.
కానీ వైసీపీ ప్రభుత్వం ధాటికి భయపడి పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాష్ట్రానికి మొహం చాటేసి చాలా కాలమే అయ్యింది. ఉన్న ఒకటీ అరా కూడా మూటాముల్లె సర్ధుకొని చల్లగా హైదరాబాద్‌కి జారుకొంటున్నాయి. మరో పక్క తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ తండ్రిని మించిన కొడుకనిపించుకొంటూ నెలకు సగటున రూ.200-400 కోట్లు పెట్టుబడులు ఆకర్షిస్తూ, జాతీయ, అంతర్జాతీయ ఐటి, పరిశ్రమలను హైదరాబాద్‌కు రప్పించుకొంటున్నారు. కంపెనీలు కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కే మొగ్గు చూపుతున్నాయి. కనుక హైదరాబాద్‌ను, తెలంగాణ రాష్ట్రాన్ని కాదని అప్పుల కుప్ప..ఒయ్యారి భామలాగ ఉన్న ఏపీ వైపు ఎవరైనా తొంగి చూస్తారా…వస్తారా? అని గిట్టనివాళ్లు చెవులు కొరుక్కొంటున్నారు.
ఎందుకంటే, గత రెండున్నరేళ్ళుగా కూడా ఏపీలో ఐటి, పరిశ్రమల శాఖ ఉంది…దానికో మంత్రివర్యులు ఉన్నారు. కానీ రాష్ట్రానికి ఒక్క ఐటి కంపెనీ రాలేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. తేలేదు. ఈ నేపధ్యంలో అసలు మనకు ఐటి, పరిశ్రమల శాఖ అసలు అవసరం ఉందా?లేకపోతే మంత్రి ఎందుకు?అనే ధర్మసందేహాలు ప్రజలకు కలుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ మాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి చేయలేని పని కొత్త మంత్రి గుడివాడ అమర్నాథ్ చేయగలిగితే ఆంద్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులే. ఆ శుభదినం కోసం అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూదాం.



