అందరూ చూస్తుండగానే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, దగ్గుబాటి పురందేశ్వరి జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ వాదనలు వినిపిస్తున్నారు.
జగన్ ఎప్పటిలాగే సంక్షేమ పధకాల పాత పాట వినిపిస్తూ చేసిన మేలు మరిచిపోవద్దని ప్రజలను వేడుకొంటున్నారు. అయితే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు, అమరావతి, విశాఖ రాజధాని, పోలవరం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వోద్యోగులలో అసంతృప్తి వంటి అంశాల గురించి ప్రస్తావించడం లేదు.
ఒకవేళ ఈ అంశాలపై చర్చ జరిగితే వాటికి జగన్ కూడా సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ఎన్నికలలో వైసీపి ఓడిపోవడం ఖాయం. అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూ చాలా తెలివిగా వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నారు.
‘చెల్లి పసుపు చీర’ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనే భావించవచ్చు. దాంతో కొన్ని రోజులు అన్నా-చెల్లెలు ఎన్నికల ప్రచారాన్ని ఏవిదంగా హైజాక్ చేశారో అందరూ చూశారు.
రాష్ట్రాన్ని 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్ చెప్పుకోవడానికి ఏమీ లేనందునే సంక్షేమ పధకాల గురించి చెప్పుకొంటూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుకోవచ్చు.
కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ కూడా జగన్ ఎత్తులను నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. అందుకే చాలా పేలవంగా ఉన్న వైసీపి మ్యానిఫెస్టోలో కొన్ని హామీల గురించి నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ గురించి నిలదీసి ప్రశ్నిస్తూ జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఏపీలో ఇకపై స్థిరాస్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే స్టాంప్ పేపర్స్‌కు బదులు జిరాక్స్ కాపీలే ఇస్తారనే వార్తలు చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అమలుచేసి, తమ స్థిరాస్థి పత్రాలను ప్రభుత్వం తీసుకునేందుకే జిరాక్సు పేపర్లు తమ చేతిలో పెడుతోందని అనుమానిస్తున్నారు.
పొంచి ఉన్న ఈ ప్రమాదం గురించి చంద్రబాబు నాయుడు ప్రజలను పదేపదే హెచ్చరిస్తున్నారు. జగన్ తాకట్టు పెట్టడానికి రాష్ట్రంలో ఇక ఏమీ మిగిలిలేవు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడని, కనుక తమ నెత్తిన చెయ్యి పెట్టబోతున్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
గత ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాగే జగన్ వలన కలుగబోయే అనర్ధాలను వివరించి ప్రజలను హెచ్చరించారు. ఆనాడు చంద్రబాబు చెప్పిన ప్రతీ మాట నిజమైంది. కానీ జగన్ మాయ మాటలు నమ్మి మోసపోయి ప్రజలు ఐదేళ్ళు నరకం చూశారు కనుక ఈసారి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు తప్పదని ‘మౌత్ టాక్’ వినిపిస్తోంది.




