వరద ఉధృతి తగ్గినా ఇంకా భయం గుప్పిట్లోనే రెండు రాష్ట్రాలలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. వరదలలో లక్షలాదిమంది ప్రజలు అల్లాడుతున్న వేళ బొజ్జగణపయ్యను సిద్ధం చేసే చలువ పందిర్లు బోసిపోతున్నాయి.
Also Read – కేజ్రీవాల్ కాదు… క్రేజీవాల్… 48 గంటల్లో రాజీనామా!
మాములుగా అయితే ఇప్పటికే అటు హైద్రాబాద్ లో ఇటు విజయవాడలో వినాయక చవితి పండుగ హడావుడి మొదలిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల ప్రజలు ముంపు బారిన పడడంతో ప్రజలు చేయూతనిచ్చే సాయంకోసం ఎదురు చూస్తున్నారే తప్ప వేడుకలకు సిద్ధంగా లేరు.
విజ్ఞాలు తొలగించే వినాయకుడికి వరదలతో విజ్ఞాలు ఎదురయ్యాయి. తొలి పూజ అందుకునే వినాయకునికి ఈ ఏడాది ప్రకృతి విపత్తు ఆటంకాలను తీసుకువచ్చింది. చవితి వేడుకలతో రెండు రాష్ట్రాలు కోలాహలంగా సాగే ఈ ఆనంద సమయంలో వరద బాధితుల ఆకలి కేకలు వినపడుతున్నాయి.
Also Read – వందే భారత్‌కి ప్రధాని పచ్చ జెండాలు ఇంకెంత కాలం?
చవితి వేడుకలలో హైదరాబాద్ నగరంలో ఉండే సందడి వాతావరణం అంతా ఇంతా కాదు. ఖైరతాబాద్ గణపతి, బాలాపూర్ లడ్డు అంటూ భక్తులు తెగ హడావుడి చేస్తుంటారు. హైద్రాబాద్ లో జరిగే చవితి వేడుకలు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో హైద్రాబాద్ కూడా చవితి వేడుకలలో వెలవెలబోతోంది.
ఇక విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో అయితే ఇంకా సహాయక చర్యలు కూడా పూర్తి కానీ పరిస్థితి. ఇప్పటికి వరద ముంపు లోనే బాధితులు సాయంకోసం వేచి ఉన్నారు. బాధితుల ఆక్రందనలు మిన్నంటుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం.
Also Read – అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి వెళ్ళలేదు!
ఒకపక్క గూడు కోల్పోయి, పొట్ట చేత పట్టుకుని చంటి పిల్లలతో, ఇంటి పెద్ద దిక్కులతో దిక్కు లేని పరిస్థితులలో దీనంగా రోడ్ల మీద జీవన సాగిస్తున్న వారిని పక్కన పెట్టుకుని మరో పక్క వేడుకలు చేసుకోవడానికి మనస్సురాక ఎంతోమంది ఈ వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నారు.
వీధికో వినాయకుని ప్రతిమ కనపడే ఈ సమయంలో రోడ్డుకొక బొజ్జగణపయ్య కూడా దర్శనం ఇవ్వలేకపొతున్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో చాలామంది మానవత్వంతో ఈ చవితి పందిర్లకు వెచ్చించే మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా దేవుని సేవ లేదా అంతకంటే ఎక్కువే అవుతుంది.
మాములుగా అయితే ఈ సమయంలో పందిర్ల ఏర్పాటుకు ప్రభుత్వాల అనుమతుల కోసం ఎదురు చూసే ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే పులిహార పొట్లాల కోసం, గుక్కెడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. సాయం కోసం ప్రజలు, సాయం అందించే పనిలో ప్రభుత్వాలు తలమునకలవుతున్న వేళ వినాయకుని పూజకు వరద రూపంలో తొలి విఘ్నం కలిగింది.