రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారింది. కనుక ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయం మరింత ఎక్కువ శ్రద్ద పెట్టి ఎక్కడికక్కడ , వ్యవసాయాధారిత ‘ఫుడ్ ప్రాసెసింగ్’ పరిశ్రమలను నెలకొల్పి ఉంటే రైతులకు భరోసా లభించి ఉండేది. స్థానికులకు ఉద్యోగాలు లభించేవి. రాష్ట్రానికి మంచి ఆదాయం కూడా లభించి ఉండేది. కానీ పవర్ హాలీడేస్, విద్యుత్ కోతలు విధిస్తూండటంతో ఉన్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. విజయనగరం జిల్లా భీమసింగిలో సహకార చక్కెర కర్మాగారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
దీని పరిధిలో సుమారు 700 ఎకరాలలో చెరుకు పండుతుంటుంది. అయితే మరమత్తులు చేయకపోవడంతో మూడేళ్ళుగా మిల్లు మూతపడింది. దీంతో చెరుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గత ఏడాది అతికష్టం మీద సంకిలి చెరుకు మిల్లుకి అమ్ముకొని బయటపడ్డారు. కానీ నేటికీ భీమసింగి చెరుకు మిల్లు తెరుచుకోకపోవడంతో ఈ ఏడాది కూడా సంకిలి మిల్లుకే తరలించాల్సి ఉంది.
అందుకు సంకిలి మిల్లు సిద్దంగానే ఉన్నప్పటికీ భీమసింగి పరిధిలోని చెరుకును సంకిలి తరలించేందుకు కూడా చెరుకు కమీషన్ నుంచి ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వకపోగా ఈసారి సంకిలి మిల్లుతో చెరుకు ధర, కటింగ్, తరలింపు గురించి తాము మాట్లాడబోమని అధికారులు ఖరాఖండీగా చెపుతుండటంతో చెరుకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోయినా ఇటువంటి వాటినైనా కాపాడుకొంటే దానిపై ఆధారపడిన వందలాది మంది రైతులకు మేలు జరుగుతుంది కదా?అసలు భీమసింగి చక్కెర మిల్లు మూడేళ్ళుగా మూతపడి ఉంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది?అధికారులు ఏమి చేస్తున్నారు?అనే సందేహం కలుగక మానదు.
ఏపీలో విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, కోనసీమ, చిత్తూరు జిల్లాలలో విస్తారంగా వరి, చెరుకు, మామిడి, టోమెటో, బొప్పాయి వగైరా పండుతాయి. ఈ జిల్లాలకు సుమారు 750 కిమీ దూరంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రైవేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఏటా వేలాది టన్నుల మామిడిపళ్ళు, టోమెటో, బొప్పాయి తదితర వ్యవసాయోత్పత్తులను ఇక్కడి రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలలో అక్కడికి తీసుకువెళ్ళి, వాటితో జామ్, ఫ్రూట్ జ్యూస్, సాస్, ఊరగాయలు వంటి అనేక ఆహారోత్ప్పతులు తయారుచేస్తున్నాయి.
మన వ్యవసాయోత్పత్తులను అంత దూరం తీసుకువెళ్ళి వాటితో ఆ పరిశ్రమలు లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, అదే పని మన ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది?అనే సందేహం కలుగక మానదు. రైతు భరోసా పేరుతో డబ్బు పంచిపెట్టే బదులు, భీమసింగి వంటి మిల్లులను సక్రమంగా నడిపిస్తూ ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఏర్పాటు చేస్తే అదే అసలు సిసలైన రైతు భరోసా అవుతుంది కదా?



