నిరుపేదలకి ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటాయి ప్రభుత్వాలు. కేంద్రప్రభుత్వం ఏటా దీని కోసం వేలకోట్లు ఖర్చు చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బియ్యం పంపిణీకి గొప్పగొప్ప పేర్లు పెట్టి ఇంకా గొప్పగా ప్రచారం చేసుకొంటుంటాయి. జగనన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేకంగా బియ్యం కార్డులు ఇవ్వడమే కాకుండా “మీ ఇంటి గుమ్మం వద్దకే బియ్యం తెచ్చి అందిస్తాం…” అంటూ వందల కోట్లు ఖర్చు చేసి వేల వాహనాలు కొనేసి బియ్యం సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఇంటికే తెచ్చి బియ్యం ఇస్తోంది కనుక మళ్ళీ గెలిపిస్తే జగనన్న ప్రభుత్వమే అన్నం వండి తీసుకువచ్చి గోరుముద్దలు కూడా తినిపిస్తుందేమో…ఒకవేళ మనకు నమిలే తీరిక, ఓపిక లేకపోతే వైసీపీ నాయకులే నమిలి పెడతారేమో?అని గిట్టనివాళ్ళు కుళ్ళు జోకులు వేసుకొని నవ్వుకొంటున్నారు. అది వేరే సంగతి!
అనేక దశాబ్ధాలుగా సజావుగా ఈ బియ్యం పంపిణీ సాగిపోతుంటే, వైసీపీ ప్రభుత్వ సలహాదారులలో ఎవరు ఇచ్చారో కానీ ఓ కొత్త ఐడియా ఇచ్చారు. అదేమిటంటే ఒకవేళ ఎవరైనా బియ్యం వద్దనుకొంటే దానికి బదులుగా డబ్బులు ఇచ్చేయాలని. డబ్బు ఎవరికీ ఊరికే రాదు…ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే మాటలు రోజూ అందరం వింటూనే ఉన్నాము. కనుక ఈ ఐడియాను జగనన్న ప్రభుత్వం ప్రకటించేసింది. ఎందుకైనా మంచిదని ఒకవేళ ఎవరైనా డబ్బు వద్దనుకొంటే మళ్ళీ బియ్యం ఇస్తామంటూ ఆ ప్రతిపాదనలో పైన ఓ స్టార్ చుక్క కూడా పెట్టింది. అది జనం చూశారో లేదో కానీ గిట్టని వాళ్ళు మాత్రం చూడలేదు.
గిట్టనివాళ్ళతో నిండిపోయున్న ఈ లోకం దీనిని అపార్ధం చేసుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తోంది. కాషాయ కండువా కప్పుకొనే సోమూ వీర్రాజు అనే ఓ పెద్దాయన “కేజీకి రూపాయి చొప్పున ఓ 30-40 రూపాయలు ప్రజల చేతిలో పెట్టి, వైసీపీ నేతలు ఆ బియ్యాన్ని కాస్త పాలిష్ చేయించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొందామనుకొంటున్నారేమో? అలా చేస్తే కేజీకి కనీసం రూ.40కి తక్కువ కాకుండా వస్తుంది. అదే విదేశాలకు ఎగుమతి చేసుకొంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది ఖచ్చితంగా వారి ఐడియాయే. చాలా దారుణం,” అంటూ అన్నెంపున్నెం తెలీని జగనన్న ప్రభుత్వాన్ని ఆడిపోసుకొన్నారు.
ఇక ఎర్ర చొక్కా వేసుకొన్న రామకృష్ణ అనే మరో పెద్దాయన మాట్లాడుతూ “పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే ఈ పధకం అమలుచేస్తుంటే దానిని ఏపీ ప్రభుత్వం లాగేసుకోవాలనుకోవడం చాలా దారుణం. ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బుతో వారు మళ్ళీ అన్ని బియ్యం కొనుక్కోగలరా?కొనుక్కోలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? అప్పుడు వారు ఏమి తిని బతకాలి?అయినా పేదలకిచ్చే బియ్యం తీసుకొని ప్రభుత్వం ఏమి చేసుకొంటుంది?ఇప్పుడు బియ్యానికి బదులు డబ్బులు ఇస్తానంటుంది… రేపు ఏదో వంకతో ఆ డబ్బు కూడా కోసేసుకోవడానికే ఈ ఎత్తు వేసిందేమో?అంటూ అర్ధంపర్ధం లేని ధర్మసందేహాలు వ్యక్తం చేశారు. లోకులు పలుగాకులు…పేదలకు బియ్యానికి బదులు డబ్బు ఇచ్చి సాయం చేయాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ ప్రతిపాదన చేసినా ‘కావ్..కావ్… మని కాకుల్లా అరుస్తూనే ఉంటారు. ప్చ్!



