
దేశంలో ప్రతీ రాజకీయ నాయకుడూ ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి మంత్రి పదవులు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటారు. అయితే వారిలో ఎంతమంది నిజాయితీగా, సమర్ధంగా పనిచేస్తారు?అంటే సమాధానం చెప్పడం కష్టమే.
గత 5 ఏళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ముందు వాటిని చక్కబెట్టుకోవడమే పెద్ద పనిగా మారిందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..
నేటికీ అధికారులలో కొందరు జగన్ భక్తులు ఉద్దేశ్యపూర్వకంగా సహాయచర్యలు చేపట్టకపోగా ఆటంకాలు కూడా సృష్టిస్తుండటం చూసి తాను దిగ్బ్రంతి చెందానని అన్నారు. జక్కంపూడిలో అటువంటి ఓ అధికారిని మంగళవారం ఉదయమే సస్పెండ్ చేశానని చెప్పారు.
ఇటువంటి కష్టకాలంలో కూడా కొందరు రాజకీయాలు చేస్తున్నారని వాటిని కూడా కాసుకోవలసి వస్తోందని సిఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత
తాను ఎంతగా కష్టపడుతున్నా ఈ కష్టకాలంలో ఇటువంటి వ్యవస్థలు… దానిలో ఇటువంటి వ్యక్తుల వలన బాధితులకు ఆహారం, మంచినీళ్ళు, అవసరమైన సహాయం అందించలేకపోతున్నానని సిఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ పరిసర ప్రాంతాలలో నిన్న ఒక్కరోజే సుమారు 3 లక్షల మందికి ఆహారం అందించామని, కానీ ఆహార పొట్లాలు పంపిణీని సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోవడం వలన కొంతమంది బాధితులకు అందలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
గత రెండు రోజులుగా ప్రతీ మంత్రికి, అధికారికి పేరుపేరునా చురుకుగా పనిచేయాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చెపుతూనే ఉన్నానని, ఇకపై ఉపేక్షించబోనని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఒక్క అధికారులపైనే కాదు అవసరమైతే మంత్రులపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని సిఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు.
ప్రభుత్వంలో అందరి లక్ష్యం వరద బాధితులకు అవసరమైన సహాయసహకారాలు అందించడమేనని కనుక ఈ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకొని చురుకుగా పనిచేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
సాధారణంగా సిఎం చంద్రబాబు నాయుడు అంత త్వరగా సహనం, సంయమనం కోల్పోరు. కానీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాక మునుపే మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటానని హెచ్చరించడాన్ని తేలికగా తీసుకోలేము. సిఎం చంద్రబాబు నాయుడుకి అంతగా అసహనం కలిగిస్తున్న ఆ మంత్రి లేదా మంత్రులు ఎవరు?