ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అంటే దూరదృష్టి, అభివృద్ధి. రాష్ట్రంలో మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇదివరకు జగన్ తరిమేసిన ‘లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్’ అధినేత యూసఫ్ అలీతో స్వయంగా మాట్లాడి మళ్ళీ ఏపీకి రావలసిందిగా విజ్ఞప్తి చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు యూసఫ్ అలీ, ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ తదితరుల బృందం నిన్న అమరావతికి రాగా సిఎం చంద్రబాబు నాయుడు వారికి శాలువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సిఎం చంద్రబాబు నాయుడు వారితో జరిపిన చర్చల వివరాలను సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు.
“విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలలో లూలూ గ్రూప్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు ఏర్పాటు చేయాలని కోరాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయాలని కోరాను. వాటి ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల సహకరిస్తుందని హామీ ఇచ్చాను. ‘లులూ గ్రూప్’ అధినేత యూసఫ్ అలీతో మా ఈ అనుబందం ఆ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య చక్కటి భాగస్వామ్యం కుదుర్చుతుందని ఆశిస్తున్నాను,” అని సిఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ వారితో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
ఇదివరకు అంటే… 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన వలన తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు చాలా అవసరమని గుర్తించి యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీతో మాట్లాడి విశాఖపట్నం సముద్రతీరంలో ఓ అతిపెద్ద హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
లులూ గ్రూప్ విశాఖలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంటే, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చారు. రాగానే దానికి భూకేటాయింపు, లీజు సరిగ్గా లేదంటూ రాష్ట్రం నుంచి తరిమేశారు!
అప్పుడు తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించి లూలూ గ్రూప్‌ని తమ రాష్ట్రానికి తీసుకుపోయింది. ఆ సంస్థ కోయంబత్తూరులో రూ.3,000 కోట్లతో అతిపెద్ద హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత తెలంగాణ మాజీ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో యూసఫ్ అలీని కలిసి తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్ధించగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో రూ.1,000 కోట్లతో అతి భారీ కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.
లూలూ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న హైపర్ మార్కెట్స్ , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా వేలాదిమంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాది పొందుతున్నారు. పన్నుల రూపంలో ఆయా రాష్ట్రాలకు లూలూ గ్రూప్ నుంచి భారీగా ఆదాయం కూడా లభిస్తుంది.
కానీ చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో జగన్ లూలూ గ్రూప్‌ని రాష్ట్రం నుంచి తరిమేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం జగన్‌లాగ వ్యవహరించలేదు. విశాఖలో జగన్ శంకుస్థాపన చేసి ప్రారంభించిన ‘ఇనార్బిట్ మాల్’కి ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందజేస్తున్నారు.
ఇప్పుడు విశాఖ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర నగరాలలో కూడా లూలూ గ్రూప్ చేత హైపర్ మార్కెట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్నారు.
రాజకీయాలు వేరు రాష్ట్రాభివృద్ధి వేరనే చిన్న విషయం గ్రహించకుండా జగన్ తన రాజకీయ ద్వేషానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయేలా చేశారు. అదే… జగన్ కూడా సిఎం చంద్రబాబు నాయుడులా ఆనాడు లూలూ గ్రూప్‌కి సహకరించి ఉండి ఉంటే, నేడు ఈ పాటికి విశాఖ నగరంలో అతిపెద్ద హైపర్ మార్కెట్ ఏర్పడి వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాది లభించి ఉండేవి కదా?




