సహవాస దోషం… అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే వారి దురలవాట్లు మనకీ అంటూకోవడమే కాకుండా, దాని పర్యవసానాలు కూడా భరించక తప్పదు. ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలలో సహవాస దోషం వలన పలువురు ఉన్నతాధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్మాణాలు, ధరణి పోర్టల్… ఇలా ఒకటేమిటి ప్రతీ వ్యవహారంలో కేసీఆర్ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేసిన ఉన్నతాధికారులు పోలీస్ కేసులు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఇప్పటికే జైల్లో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు ఉన్నతాధికారులు, మాజీ మంత్రులు, వైసీపి నేతలు ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. జగన్ సహవాసం కారణంగా చేయకూడని తప్పులు చేసిన పలువురు ప్రభుత్వం మారగానే పరారయ్యారంటే తప్పు చేశామని వారు కూడా గ్రహించారని అర్దమవుతోంది.
అటువంటి వారిలో రాష్ట్ర గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి కూడా ఒకరు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా గనులు, ఇసుక తవ్వకాలకు అనుమతించి వారి అవినీతిలో భాగం అయ్యినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అప్పటి నుంచి పరారిలో ఉన్న వెంకటరెడ్డిని ఏసీబీ పోలీసులు గురువారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గొల్లపూడిలో ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు.
గతంలో అంటే… ఓ మూడు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వాలు మారినా అధికారులు ఇలా పారిపోయేవారు కారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే పారిపోతున్నారు. ఎందువల్ల?అంటే సహవాస దోషం వల్లనే అని చెప్పవచ్చు.
తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా ఉద్యోగాలలో చేరుతున్న 700 మంది ఇంజనీర్లని ఉద్దేశ్యించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఓ చక్కటి సలహా ఇచ్చారు. “ఇంజనీర్లు తమ వృత్తిలో ఎటువంటి తప్పులు చేయకూడదో కాళేశ్వరం ప్రాజెక్టు తెలియజేస్తోంది. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా పైఅధికారులు ఒత్తిడి చేస్తున్నారని మీరు తప్పులు చేయొద్దు. ధైర్యంగా, నిబద్దతతో పనిచేయండి. రాష్ట్రానికి మేలు చేసి మంచి పేరు తెచ్చుకోండి,” అని హితవు పలికారు.
రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి తప్పులు చేయిస్తే, అవినీతి, అక్రమాలు జరిగితే వాటికి అధికారులే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వారిచేత ఆ తప్పులు చేయించిన రాజకీయ నాయకులు చాలా సులువుగా తప్పించుకోగలరు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు ఆయా అధికారులే బాధ్యత వహించాలి వాటితో తనకు ఎటువంటి సంబందమూ లేదని తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ చెప్పడమే ఉదాహరణ.
ఇదేవిదంగా ఇప్పుడు జగన్ అండ్ కో రాజకీయాలు చేసి తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో నుంచి సులువుగా తప్పించుకుని బయటపడగలరు. అందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ వారి సహవాసంలో తప్పులు చేసినందుకు ఇప్పుడు ఎంతమంది అధికారులు, ఎన్ని సంస్థలు మూల్యం చెల్లించాల్సి వస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు.
అనేక ఒత్తిళ్ళను తట్టుకొని నిజయతీగా పనిచేయడం ఆచరణలో చాలా కష్టమే అని అందరికీ తెలుసు. కానీ మూడు, నాలుగు దశాబ్ధాల క్రితం అధికారులు ఇలాగే పనిచేసేవారు కదా? మరిప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు?అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం మారిన ప్రతీసారి అధికారులు పరారీ కావలసివస్తే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?




