“మద్యపానం వలన సామాన్య ప్రజల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయి. కనుక రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేదం అమలుచేస్తాం…” ఎన్నికలకి ముందు జగనన్న చెప్పిన మాటలవి.
అయితే ఆయన హామీలకి కూడా ‘షరతులు వర్తిస్తాయని సూచించే చిన్న స్టార్ గుర్తు’ ఎవరికీ కనబడలేదు. అందుకే అధికారంలోకి రాగానే మద్యం ధరలు భారీగా పెంచేసి మద్యపాన నిషేధంలో ఇదీ ఓ భాగమే చెపితే మందుబాబులకి అంతకు ముందు తాగినదంతా దిగిపోయింది. కానీ ప్రభుత్వాలని పోషించే మందు బాబుల ఉసురు తగిలితే ఏ ప్రభుత్వం ఎక్కువకాలం నిలువలేదు. ధరలు పెంచేసి వారిని ఇబ్బందిపెడితే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. కనుక ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది.
అయితే ఇదంతా దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగమే అని జనాలకి అర్దం కావడం లేదు. కానీ మందు బాబులకి అర్దం అవుతోంది. అందుకే జగనన్నకి జై కొడుతున్నారు.
“మేము చేసేదే చెపుతాము… చెప్పింది తప్పకుండా చేస్తాం…” అని జగనన్న గర్వంగా చెప్పుకొంటుంటారు. చెప్పుకోవడమే కాదు చేసి చూపుతున్నారు కూడా.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈరోజు, రేపు (జనవరి 1వ తేదీ) అర్దరాత్రి 12 గంటల వరకు రాష్ట్రంలో వైన్ షాపులన్నీ తెరిచి మద్యం అమ్ముకోవచ్చని, బార్ అండ్ రెస్టారెంట్స్, ఈవెంట్స్, స్టార్ హోటల్స్ లో రాత్రి ఒంటి గంటవరకు మద్యం అమ్ముకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది.
ఏపీలో దాదాపు అన్ని వైన్ షాపులు ఏపీ బేవారెజస్ కార్పొరేషన్ అధ్వర్యంలో నడుస్తున్నవే. కనుక ఈ రెండు రోజులలో మందుబాబులు రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా ఆదాయం సమకూర్చిపెడతారు. కనుక ఈ నెల ఉద్యోగులకు సంక్రాంతి పండుగలోగానే జీతాలు పడిపోవచ్చు.



