వైసీపీ అధినేత జగన్ ఆలోచన ఎప్పుడూ సాధారణ రాజకీయ నాయకులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. దీనికి మూడు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
జగన్ రాజకీయంగా ఇంకా తొలి అడుగులు వేయక మునుపే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే క్రుంగిపోలేదు. వెంటనే ఓదార్పు యాత్రలు మొదలుపెట్టి అయన ఆకస్మిక మరణం వలన ప్రజలలో ఏర్పడిన సానుభూతిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆ సమయంలో అయోమయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌ని వైఎస్ వారసుడుగా తనవైపు తిప్పుకొని వైసీపీని నిర్మించుకున్నారు.
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించి ఉద్యోగ కల్పన చేసే బదులు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు నిర్మించుకోవాలని ప్రయత్నించారు. లక్షల కోట్ల విలువైన అమరావతిని పాడు బెట్టడానికి ఏమాత్రం సంకోచించలేదు.
అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌లో మరిన్ని కొత్త కోణాలు కనిపిస్తున్నాయి.
సాధారణంగా ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఇటువంటి సమయంలో ప్రజల మధ్యకు వెళ్ళి వారి సమస్యల పరిష్కారం పేరుతో ప్రభుత్వంతో పోరాటాలు చేస్తాడు. ఓటమి కారణంగా నిరుత్సాహపడిన పార్టీ నేతలు, కార్యకర్తల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనే నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తారు.
కానీ వైసీపీ అధినేత జగన్ రెండేళ్ళుగా శాసనసభకు, ప్రజల మధ్యకు వెళ్ళకుండా తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తూ, వాటితో కూటమి ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇంట్లో కూర్చొనే పార్టీని నడిపిస్తున్నారు.
అధికారంలో ఉన్న 5 ఏళ్ళు రాజధానికి భూములిచ్చిన రైతులతో అయన ఎంత కటినంగా వ్యవహరించారో అందరూ చూశారు. కానీ ఇప్పుడు ఆయనే రాజధాని (విస్తరణ కోసం రెండో విడత భూసేకరణకు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న) రైతుల తరపున పోరాడాలనుకోవడం, వైసీపీ నేతలను వారి వద్దకు పంపించడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇది కూడా అయన తాజా వ్యూహంలో భాగమేనని అర్ధమవుతోంది.
కనుక ఈవిధంగా ఇంట్లో కూర్చొనే వ్యూహాలు రచిస్తూ, వాటితో రాష్ట్ర రాజకీయాలను నడిపిస్తున్న జగన్ వర్తమాన రాజకీయ నాయకులలో చాలా భిన్నమైనవారే కదా?




