పధకాలు వారికి… భారం మాకా?

Passengers boarding Stree Shakti bus with an auto driver receiving Auto Mitra support

ఒక వర్గానికి ఓ సంక్షేమ పధకం ప్రకటిస్తే అది అక్కడితో ఆగదు… దానికి కొనసాగింపుగా మరో వర్గానికి మరో పధకం ప్రవేశపెట్టక తప్పదు.

ఇందుకు తాజా ఉదాహరణగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి దానికి కొనసాగింపుగా ఆటో మిత్ర పధకాల గురించి చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

స్త్రీశక్తి ద్వారా రాష్ట్రంలో లక్షలాది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయమే. కానీ దీని వలన ఆటో డ్రైవర్లు భారీగా ఆదాయం కోల్పోతారు కనుక వారినీ ఆదుకోవలసిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది.

దీని కోసం ఆటోమిత్ర పధకం కింద ఆటో డ్రైవర్లకు ఏడాది రూ.15,000 చొప్పున చెల్లించబోతోంది. రేపు (శనివారం) నుంచే ఆటో డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలలో ఈ సొమ్ము జమా చేయబోతున్నట్లు తాజా సమాచారం.

కానీ ఏ పధకాలు వర్తించని ప్రజలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. ఈ పధకాల భారం బస్సు, విద్యుత్‌, ఇంటి పన్ను తదితర ఛార్జీల పెంపు రూపంలో వారిపైనే పడుతుంది. సంక్షేమ పధకాల లబ్ధిదారులపై కూడా ఎంతో కొంత పడుతుంది. కానీ వారు కొంత లబ్దిపొందుతున్నారు కనుక బాధ పడరు.

సంక్షేమ పధకాల విషయంలో గత ప్రభుత్వం వైఖరిని తప్పు పట్టి, ఇప్పుడు దానికి మించి సంక్షేమ పధకాలు అమలుచేయడం అవసరమా? అయినా రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ఎడాపెడా హామీలు ఇస్తే, వాటికి తమని బాధ్యులను చేయడం ఏమిటని మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వారి వాదన అర్ధం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న జీఎస్టీ పన్నుని కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు జరుగబోతున్న ఉత్తరాది రాష్ట్రాలలో విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అరకొర నిధులు విదిలించడాన్ని తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తరచూ నిలదీస్తూనే ఉన్నాయి కదా?

రాష్ట్రాల విషయంలో కేంద్రం చేస్తున్నది తప్పని వాదిస్తున్నప్పుడు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అదే తప్పు చేస్తున్నాయి కదా? వారు ఎంతో కష్టపడి సంపాదించే సొమ్ముని సంక్షేమ పధకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ఖర్చు చేయడాన్ని ఎలా సమర్ధించుకోగాలవు?

తమ కష్టార్జితాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నప్పుడు, ఆ భారం మోస్తున్న తమకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కదా? కానీ ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు, మురుగు కాలువలు, వెలగని విద్యుత్‌ దీపాలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంటాయి కదా?అని ప్రశ్నిస్తున్నారు.

వృద్ధులు, ఒంటరి మహిళలు, అనాధలు, అంగవైకల్యం, దీర్గకాల రోగాలతో బాధపడుతున్నవారికి ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పధకాలు ఇచ్చినా ఎవరూ తప్పు పట్టరు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అవసరం లేని వారికి కూడా పధకాలు అమలుచేస్తుండటమే తప్పని వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక తలకు మించిన ఈ సంక్షేమ పధకాలకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎక్కడో అక్కడ బ్రేక్ వేయడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories